‘కస్టమర్‌ కేర్‌’ టోకరా!

2 Sep, 2019 10:19 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రస్తుతం ఇంటర్నెట్‌ సమాజం నడుస్తోంది. అధిక శాతం మంది ప్రజలు సమాచారం కోసం దీని మీదే ఆధారపడుతున్నారు. ఇంటర్నెట్‌లో కనిపించేదంతా అమాయకంగా నమ్మితే సైబర్‌ నేరస్తుల చేతిలో మోసపోవడం ఖాయం. సైబర్‌ నేరస్తుల దృష్టి ఇటీవల కాలంలో కస్టమర్‌ కేర్‌ నంబర్లపై పడింది. సాధారణంగా తమ ఉత్పత్తులు, సేవల విషయంలో వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రముఖ సంస్థలు కస్టమర్‌ కేర్‌ కేంద్రాలను నెలకొల్పడాన్ని నేరస్తులు మోసాలకు అనువుగా మలచుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో అచ్చం ఆయా సంస్థల వెబ్‌సైట్ల మాదిరిగానే నకిలీ వెబ్‌సైట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో కస్టమర్‌ కేర్‌ నంబర్లుగా తమ సెల్‌ఫోన్‌ నంబర్లనే ఉంచుతున్నారు. ఎవరైనా పొరపాటున ఆ నంబర్లకు ఫోన్లు చేస్తే బురిడీ కొట్టిస్తున్నారు. అచ్చం ప్రతినిధులుగానే మాట్లాడుతూ డబ్బు కొట్టేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోయిన బాధితులు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. 

ఫోన్‌పే కస్టమర్‌ కేర్‌ పేరిట టోకరా
చిట్టినగర్‌కు చెందిన సిద్దూ కార్‌ ట్రావెల్స్‌ యజమాని ఎస్‌కే మాబుసుభాని ఈ ఏడాది జనవరి 25న తన స్నేహితుడు చాణక్యకు ఫోన్‌ పే వ్యాలట్‌ ద్వారా రూ.10వేల నగదు లావాదేవీ నిర్వహించాడు. అది విఫలం కావడంతో ఫోన్‌పే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయాలనుకున్నారు. ఇంటర్నెట్‌లో వెతకడంతో ఫోన్‌పే వినియోగదారుల సేవాకేంద్రం ప్రతినిధి పేరుతో 62949 08423 నంబరు కనిపించింది. ఆ నంబరుకు ఫోన్‌ చేయడంతో అవతలి నుంచి మాట్లాడిన వ్యక్తి తనను తాను ఫోన్‌పే కస్టమర్‌ కేర్‌ ప్రతినిధిని అని చెప్పుకొన్నాడు. సమస్య పరిష్కారం కావాలంటే మీ మొబైల్‌కు వచ్చే మేసేజ్‌ను ఓకే చేయండి అన్నాడు. అలా ఐదు సార్లు మేసేజ్‌ పంపి ఓకే చేయించి మాబుసుభాని అకౌంట్‌ నుంచి రూ.50 వేలు మాయం చేశారు. విషయం తెలుసుకున్న మాబుసుభాని సైబర్‌ పోలీసులను ఆశ్రయించాడు. 

‘ఎనీడెస్క్‌’తో పంజా..
భవానీపురం వాసి ఎస్‌కే జిలాని గత ఫిబ్రవరి నెల 25న తన ఎస్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఆంధ్రా బ్యాంక్‌కు డబ్బు బదిలీ కావడం లేదని గమనించి ఇంటర్నెట్‌లో ఎస్‌ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసేందుకు నంబరు కోసం వెతికాడు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబరును ఇంటర్నెట్‌లో నమోదు చేసిన విషయం తెలియని బాధితుడు.. ఆ నంబర్‌కు ఫోన్‌ చేశాడు. అదే అదనుగా బాధితుడికి ఎస్‌ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ 9939017073 నుంచి ఫోన్‌ వచ్చింది. మీ అకౌంట్‌ నుంచి డబ్బు బదిలీ కాలేదని ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించి.. తాను సూచించే యాప్‌ను చరవాణిలో నిక్షిప్తం చేసుకోవాలని జిలానికి సూచించాడు. ఈ మేరకు జిలాని ‘ఎనీడెస్క్‌’ యాప్‌ను తన సెల్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసుకొన్నారు. సదరు యాప్‌ రిజిస్ట్రేషన్‌ నంబరుతోపాటు తన సెల్‌ఫోన్‌కి వచ్చిన కొన్ని సంక్షిప్త సందేశాలనూ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధికి పంపించారు. అంతే జిలానికి చెందిన యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రూ.43వేలు, మళ్లీ నిమిషానికి ఆంధ్రాబ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.20 వేలు, మరొకసారి రూ.5 వేలు మోసగాడి బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. విషయం గ్రహించిన బాధితుడు విజయవాడ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేరుగా మాట్లాడితే మోసమే..
సాధారణంగా ప్రముఖ సంస్థలు తమ కస్టమర్‌ కేర్‌ నంబర్లతో కూడిన సమాచారాన్ని వెబ్‌సైట్లలో పొందుపర్చుతాయి. ఎవరైనా బాధితుడు ఫోన్‌ చేస్తే ముందుగా వాయిస్‌ రికార్డు రూపంలో మాటలు వినిపిస్తాయి. తర్వాతే ఆ సూచనల ఆధారంగా ప్రతినిధితో మాట్లాడేందుకు అవకాశముంటుంది. ఫోన్‌ చేసిన వెంటనే నేరుగా ప్రతినిధి మాట్లాడారంటే మాత్రం అనుమానించాల్సిందేనని సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా