విమాన ప్రమాదంలో పైలట్‌ దుర్మరణం | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదంలో పైలట్‌ దుర్మరణం

Published Sat, Feb 17 2018 7:55 AM

pilot dead in flight accident - Sakshi

టీ.నగర్‌: అసోం జరిగిన విమాన ప్రమాదంలో తాంబరానికి చెందిన పైలట్‌ సహా ఇద్దరు మృతి చెందారు. అసోం జోరహట్‌ వైమానికదళం నుంచి ఓ చిన్న విమానంలో వింగ్‌ కమాండర్‌ జైపాల్‌ జేమ్స్, టి.వత్సస్‌ నిఘా పనుల నిమిత్తం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. మజులి ఉత్తర ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్న దీవి ప్రాంతానికి వెళుతుండగా విమానంలో హఠాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌లు ప్రయత్నించారు. ఆ సమయంలో విమానం ఇసుక దిబ్బను ఢీకొని పేలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు ప్రాణాలు కోల్పోయారు. విమానం పేలుడును గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం తెలిపారు. సంఘటనా స్థలానికి వైమానిక దళ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అయినప్పటికీ విమానం పూర్తిగా కాలిపోవడంతో ఆ విమానంలో ఉన్న పైలట్‌లను కాపాడేందుకు వీలు కాలేదని పోలీసులు తెలిపారు.

తాంబరం పైలట్‌: మృతి చెందిన ఇద్దరిలో ఒకరు చెన్నై ఈస్ట్‌ తాంబరానికి చెందిన జయపాల్‌ జేమ్స్‌ (47) గా తెలిసింది. మరొకరి పేరు టి.వత్సస్‌. జేమ్స్‌ తండ్రి జయపాల్‌ వైమానిక దళంలో పని చేసి పదవీ విరమణ పొందారు. జేమ్స్‌కు భార్య గ్రేస్, కుమారుడు రోషన్, కుమార్తె రోస్మి ఉన్నారు. జేమ్స్‌ అంత్యక్రియలు బెంగళూరులో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దీని గురించి జేమ్స్‌ తండ్రి జయపాల్‌ మాట్లాడుతూ తన కుమారుడు జయపాల్‌ జేమ్స్‌ విమానంలో వెళుతూ ప్రమాదంలో మృతి చెందాడని, అతని భార్య, పిల్లలు బెంగళూరులో ఉన్నట్లు తెలిపారు. దీంతో అంత్యక్రియలు బెంగళూరులో జరుగుతాయన్నారు. తన కుమారుడు చిన్ననాటి నుంచి పైలట్‌గా చేరాలన్న ఆశతో వైమానికదళంలో చేరినట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఈస్ట్‌ తాంబరం ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు జయపాల్‌ను కలిసి ఓదార్చారు.

Advertisement
Advertisement