విద్యార్థిపై పోలీసుల ప్రతాపం | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై పోలీసుల ప్రతాపం

Published Wed, Feb 28 2018 12:46 PM

Police attack on school student - Sakshi

ప్రొద్దుటూరు క్రైం : తిట్టుకోవడం.. తిట్టుకోవడం.. మళ్లీ కొద్దిసేపటికే ఒకరికొకరు కలిసి తిరగడం ఇవన్నీ పాఠశాలల్లో విద్యార్థుల మధ్య రోజూ కనిపిస్తుంటాయి. విద్యార్థుల మధ్య చిన్న పాటి ఘర్షణ జరిగినా, వాగ్వాదం చోటు చేసుకున్నా వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన స్పల్ప ఘర్షణ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాములపేటకు చెందిన పసుపులేటి ఆంజనేయులు, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమారుడు శ్రీరాం నెహ్రూరోడ్డులోని ఆదిత్య స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలుడు సాయంత్రం 4.30 గంటల సమయంలో రూ.100 కోసం సుకుమార్‌ అనే విద్యార్థితో గొడవ పడుతుండగా విద్యార్థులందరూ గుంపు అయ్యారు. దీంతో పాఠశాల ఎదురుగా నివాసం ఉంటున్న కానిస్టేబుల్‌ నాగరాజుకు ఉపాధ్యాయుడు సమాచారం అందించాడు. నాగరాజు అక్కడికి చేరుకొని గొడవ పడుతున్న విద్యార్థులిద్దరిని మందలించారు. అంతటితో ఆగక శ్రీరాంను సాయంత్రం 5 గంటల సమయంలో త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లాడు. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకూ విద్యార్థి త్రీ టౌన్‌లోనే ఉండాల్సి వచ్చింది. బాలుడు తన తండ్రి ఊళ్లో లేకపోవడంతో పోలీసులకు తాత సెల్‌ నెంబర్‌ ఇచ్చాడు. పోలీసులు తాతకు ఫోన్‌ చేయగా ఆయన ద్వారా విషయం తెలుసుకున్న తల్లి పద్మావతి, తాత ఇద్దరు స్టేషన్‌ వద్దకు వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు వదిలి పెట్టారు.

నా కుమారుడు క్రిమినలా..!
నా కుమారుడు ఏమైనా క్రిమినలా అని పద్మావతి పోలీసులను ప్రశ్నించారు. గాయ పడిన కుమారుడ్ని ఆమె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాఠశాల నుంచి తన కుమారుడ్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొని వెళ్తే పాఠశాల యాజమాన్యం ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఔట్‌పోస్టు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

మా పాఠశాలలో గొడవ జరగలేదు
మా పాఠశాలలో విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. పాఠశాలకు దూరంగా ఉన్న రిషీ అపార్ట్‌మెంట్‌ సమీపంలో జరిగింది. బయట విద్యార్థులు గొడవ పడుతుంటే పోలీసులు పట్టుకొని వెళ్లినట్టు ఉన్నారు. ఈ గొడవతో మా పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదు. విద్యార్థిని మేం పోలీసులకు అప్పగించామని చెప్పడంలో వాస్తవం లేదు.– మోహన్‌రావు, కరస్పాండెంట్, ఆదిత్య హైస్కూల్‌.

ఆమె భర్తపై కేసులు పెట్టామనే కారణంతోనే..
గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలోనూ విద్యార్థి తండ్రి ఆంజనేయులుపై ఓ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణంరాజునాయక్‌ తెలిపారు. ఈ రెండు కేసుల్లోనూ అతన్ని రిమాండుకు పంపించామని, బయటికి వచ్చాక రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేశామన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని వారి కుమారుడ్ని పోలీసులు కొట్టారంటూ ఆస్పత్రిలో పడుకోబెట్టారని, విద్యార్థిని పోలీసులు ఎవ్వరూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని ఎస్‌ఐ వివరణ ఇచ్చారు.

Advertisement
Advertisement