అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్‌కౌంటర్‌..!

12 Aug, 2019 19:49 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : తోడబుట్టిన అక్కను హతమార్చేందుకు ఏ ఒక్కరూ సాహసించరు. తన కళ్ల ముందే..  తన చేతులతోనే సొంత అక్క ప్రాణమే తీయాల్సి వస్తే ఎటువంటి వారైనా విలవిల్లాడిపోతారు. కానీ, ఓ పోలీస్‌ మాత్రం అవన్నీ ఆలోచించలేదు. విధి నిర్వహణకు, వృత్తి ధర్మానికే కట్టుబడ్డాడు. అక్కపైనే తుపాకీతో గుళ్ల వర్షం కురిపించాడు. అయితే, క్షణకాలంలో ఆమె తప్పించుకుపోవడం గమనార్హం. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో ఉన్న బెలాంగ్‌టావ్‌ అడవిలో పోలీసులు–మావోయిస్టులకు మధ్య నాలుగు రోజుల క్రితం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో వెట్టి రామ (43) అనే పోలీసుకు మావోయిస్టు దళ సభ్యురాలైన ఆయన సొం‍త అక్క వెట్టి కన్ని(50) తారసపడింది. మరోమాట లేకుండా అక్క, ఆమె దళంపై తన సిబ్బందితో కలిసి బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా.. వెట్టికన్ని తప్పించుకుంది.

దళం నుంచి పోలీసుగా..
వెట్టి రామ, వెట్టి కన్ని ఇద్దరూ 1990లో మావోయిస్టుల దళంలో చేరి, పలు హింసాత్మక ఘటనల్లో పాలుపంచుకున్నారు. అయితే ఇటీవల (2018లో) వెట్టి రామ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయాడు. అప్పటి ఎస్పీ రాజేంద్రనాథ్‌ దాస్, రామ్‌ను మెచ్చుకుని, పోలీస్‌ ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుంచి విధుల్లో కొనసాగుతున్న వెట్టిరామ ఇటీవల ఏఎస్‌ఐగా పదోన్నతి కూడా పొందాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాలని తన అక్కకు ఆయన ఎన్నో లేఖలు రాశాడు. అయినా ఆమె లొంగిపోలేదు. దళానికి మోసం చేయలేనని ఆమె తేల్చి చెప్పినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు