రైళ్లలో హిజ్రాల ఆగడాలకు చెక్‌ | Sakshi
Sakshi News home page

రైళ్లలో హిజ్రాల ఆగడాలకు చెక్‌

Published Mon, Apr 16 2018 8:12 AM

Railway Department Special Drive On Hijras - Sakshi

సాక్షి, బెంగళూరు: రైళ్లలో ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న హిజ్రాల ఆటలకు బెంగళూరు రైల్వే డివిజన్‌ చెక్‌ చెప్పింది. ఇటీవల కాలంలో రైళ్లలో హిజ్రాల ద్వారా వేధింపులకు గురవుతున్నట్లు ప్రయాణికుల నుంచి  బెంగళూరు డివిజన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో గత మూడు నెలలుగా డివిజన్‌ అధికారులు అనేక డ్రైవ్‌లు నిర్వహించి ఆకతాయి హిజ్రాల పని పట్టినట్లు సమాచారం. మూడు నెలల నుంచి ఇప్పటివరకు 135 డ్రైవ్‌లు నిర్వహించి 100 మంది హిజ్రాలను విచారించారు.

182 టోల్‌ఫ్రీ ద్వారాఫిర్యాదుల వెల్లువ..
రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్‌పీఎఫ్‌) అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇటీవల ప్రయాణికుల నుంచి హిజ్రాలపై చాలా ఫిర్యాదులు అందాయని తెలిపారు. 182 టోల్‌ఫ్రీ ద్వారా చాలా మంది ప్రయాణికులు హిజ్రాల చేష్టలపై ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. ఏదొక స్టేషన్‌లో కొందరు హిజ్రాలు రైల్లోకి ఎక్కి పురుషు ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. డబ్బులు ఇవ్వని ప్రయాణికులన మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు 182 టోల్‌ఫ్రీ ద్వారా చాలా మంది ప్రయాణికులు తమకు ఫిర్యాదులు చేశారని  తెలిపారు. ఇటీవల కాలంలో సమాజంలో ఎంతో విస్తృతమైన సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రయాణికులు హిజ్రాలపై ఫిర్యాదులు చేస్తున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా సోషల్‌ మీడియా ద్వారానే రైల్వే మంత్రికి కూడా ప్రయాణికులు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నట్లు చెప్పారు. ఒక ప్రయాణికుడి జేబులో ఇద్దరు హిజ్రాలు చేతులు పెట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్నట్లు ఇటీవల తమకు ఒక ఫిర్యాదు అందిందని చెప్పారు. గతంలో ప్యాసెంజర్‌ రైళ్లలో మాత్రమే ప్రయాణించే హిజ్రాలు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని స్పష్టంచేశారు. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఉన్న స్టేషన్లలో దిగకుండా హిజ్రాలు తప్పించుకుని తిరుగుతున్నారని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు బెంగళూరు కంటోన్మెంట్, హిందూపూరు, బయపనహళ్లి, యశ్వంతపుర, తుమకూరు తదితర రైల్వేస్టేషన్‌లలో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించామని తెలిపారు. అంతేకాకుండా రామనగరం–చన్నపట్న, నిద్వాంద–తుమకూరు, గౌరిబిదనూరు–హిందూపూరు, దొడ్డబళ్లాపుర–గౌరిబిదనూరు, బయపనహళ్లి–కృష్ణరాజపురం రైల్వే సెక్షన్లలోనూ డ్రైవ్‌లు నిర్వహించామని చెప్పారు. ఏప్రిల్‌ వరకు ఈ డ్రైవ్‌లను కొనసాగిస్తామన్నారు.

రూ. 18,200 జరిమానా వసూలు..
ప్రత్యేక డ్రైవ్‌లలో పట్టుబడిన హిజ్రాలను రైల్వే కోర్టుల ఎదుట ప్రవేశపెట్టారు. ఇందులో రెండు కేసులు మినహా అన్ని కేసుల విచారణలను కోర్టు పూర్తి చేసి జరిమానాలు విధించింది. మొత్తం 100 మందిని విచారించిన కోర్టు రూ. 18,200 జరిమానాలను విధించి హిజ్రాల నుంచి వసూలు చేసింది. హిజ్రాలపై నమోదైన సెక్షన్ల మేరకు రూ. 100 నుంచి రూ. 300 వరకు జరిమానాను వసూలు చేశారు. 

Advertisement
Advertisement