Sakshi News home page

అత్యాచారయత్నమే కారణం..

Published Tue, Dec 5 2017 3:20 AM

reason is rape attempt itself - Sakshi

తూప్రాన్‌: డీసీఎంలో అత్యాచారానికి యత్నించడంతో తప్పించుకునే క్రమంలోనే వేగంగా వెళ్తున్న వాహనం నుంచి కళావతి కిందకు దూకి మృతి చెందిందని ఆమె భర్త రేగొండ, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ టోల్‌గేట్‌ సమీపంలోని కరీంగూడ చౌరస్తాలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ చందన దీప్తి విచారణను వేగవంతం చేశారు. డీసీఎంను కనిపెట్టేందుకు తనిఖీలు చేపట్టారు. సోమవారం స్వయంగా ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. పోతరాజ్‌పల్లిలోని వారి ఇంటికి వెళ్లి భర్త, కూతురుతో మాట్లాడారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు ఎస్పీని ప్రాథేయపడ్డారు. స్పందించిన ఎస్పీ ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కుటుంబ సభ్యులకు తగిన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డీసీఎం కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆమె వెంట తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు, సీఐ లింగేశ్వర్‌రావు ఉన్నారు.  

సీసీ కెమెరాల పరిశీలన 
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. టోల్‌ప్లాజా వద్ద పరిశీలించగా అందులో కళావతి డీసీఎం క్యాబిన్‌లో కూర్చున్నట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. కరీంగూడ చౌరస్తా వద్ద ఉన్న గోల్డెన్‌ దాబా సీసీ కెమెరాను పరిశీలించగా డీసీఎం వచ్చి రోడ్డు పక్కన నిలిపినట్టు, మొదట పాతబట్టల మూటను కిందికి వేసి ఎవరు దిగ కుండానే వాహనం వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement