కళంకిత కళాశాల! | Sakshi
Sakshi News home page

కళంకిత కళాశాల!

Published Thu, Apr 26 2018 9:12 AM

Research student Surrender In Asst Professor Nirmala Devi Case - Sakshi

విద్యార్థినులను లైంగికఅవసరాలకు వినియోగించుకునే ప్రయత్నంలో కటకటాలపాలైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి విచారణలో సహాయ నిరాకరణ అవలంభించడం అధికారులను అసహనానికి గురిచేస్తోంది.
నిర్మలాదేవిపై మరో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం, అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిశోధకవిద్యార్థి కోర్టులో బుధవారం లొంగిపోవడం వంటి ఘటనలతో విరుదునగర్‌ జిల్లాఅరుప్పుకోట్టై దేవాంగర్‌ ఆర్ట్స్‌ కాలేజి ‘కళంకాలకళాశాల’గాముద్రవేయించుకుంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్మలాదేవి వ్యవహారంలో నిగ్గుతేల్చాలని ఆదేశిస్తూ గవర్నర్‌ బన్వరిలాల్‌ నియమించిన విచారణ కమిషన్‌ బుధవారం తన రెండోదశ విచారణను ప్రారంభించింది. కమిషన్‌ చైర్మన్, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఆర్‌ సంతానం  ఈనెల 21వ తేదీ వరకు నిర్వహించిన తొలిదశ విచారణలో మదురై కామరాజ్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ చెల్లదురై, రిజిస్ట్రార్‌ తదితరుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండోదశ విచారణలో భాగంగా బుధవారం మదురైకి వచ్చిన సంతానం మదురై యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులను పిలిపించి మాట్లాడారు. జైలులో ఉన్న నిర్మలాదేవిని సైతం విచారించేందుకు చర్యలు తీసుకున్నారు.

లొంగిపోయిన పరిశోధక విద్యార్థి
ఇదే కేసులో అజ్ఞాతంలో ఉన్న పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి బుధవారం మదురై కోర్టులో లొంగిపోయాడు. నిర్మలాదేవి కేసులో సీబీసీఐడీ అధికారులు జరుపుతున్న విచారణలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మురుగన్, పరిశోధక విద్యార్థి కర్పుస్వామి పేర్లు బయటకు వచ్చాయి. మురుగన్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి రెండురోజుల పోలీస్‌ కస్టడీకి తీసుకున్నారు. పరిశోధక విద్యార్థి కరుప్పుస్వామి కోసం తీవ్రంగా గాలించినా దొరకలేదు. ఈ దశలో మదురై జిల్లా జూనియర్‌ మేజిస్ట్రేటు–5 కోర్టులో న్యాయమూర్తి సబీనా సమక్షంలో బుధవారం ఉదయం కరుప్పుస్వామి లొంగిపోయారు. ఇతడిని ఈనెల 26వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీలో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు.

పెద్దలు తప్పించుకునే అవకాశం
నిర్మలాదేవి వ్యవహారంలో ఐఏఎస్‌ తదితర ఉన్నతాధికారులకు సంబంధం ఉందని అయితే కిందిస్థాయి అధికారులపై నేరం మోపి పెద్దలు తప్పించుకునే అవకాశం ఉందని కరుప్పుస్వామి తరఫు న్యాయవాదులు బుధవారం కోర్టుకు చెప్పారు. వాస్తవాలు వెలుగు చూడాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని వారు కోరారు. కాగా, తూత్తుకూడికి చెందిన మహిళాకళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు సైతం సమన్లు పంపారు. సమన్లు అందుకున్న సదరు ప్రొఫెసర్‌ను అధికారులు విచారించారు. విద్యార్థినులతో పర్యాటకంగా వెళ్లినపుడు తప్పనిసరైన పరిస్థితిలో నిర్మలాదేవితో కలిసి తూత్తుకూడిలోని గదిలో ఉన్నానని, అంతకు మించి సంబంధం లేదని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింతమంది విద్యార్థినులను ప్రలోభపెట్టారు
విచారణకు వచ్చిన ఐఏఎస్‌ అధికారి సంతానం బృందానికి మదురైకి చెందిన న్యాయవాది ముత్తుకుమార్‌ ఒక వినతిపత్రం సమర్పించారు. దేవాంగర్‌ కళాశాలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే మరో ఇద్దరు విద్యార్థినులను లైంగిక ప్రయాజనాల కోసం నిర్మలాదేవి ఒత్తిడి చేశారని, దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా చర్యతీసుకోలేదని అందులో పేర్కొన్నారు. సదరు విద్యార్థినుల తరఫున కమిషన్‌ ముందు హాజరై ఫిర్యాదు చేశారు. వీరిద్దరినే కాదు మరింతమంది విద్యార్థినులను ఆమె ప్రలోభపెట్టారని ముత్తుకుమార్‌ మీడియాకు తెలిపారు. బాధిత విద్యార్థినుల పేర్లు, విలాసం తదితర వివరాలను కమిషన్‌కు సమర్పించినట్లు ఆయన చెప్పారు. విద్యార్థినులకు నిర్మలాదేవి బ్రెయిన్‌వాష్‌ చేసినట్లుగా చెబుతున్న ఆడియోను పరిశీలిస్తున్నట్లు సంతానం తెలిపారు.

కోర్టుకు నిర్మలా దేవి
నిర్మలాదేవికి మంజూరైన ఐదురోజుల పోలీసు కస్టడీ బుధవారంతో ముగియడంతో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఐదురోజుల కాలంలో ఆమె సరైన సమాచారం ఇవ్వకుండా విచారణకు సహకరించలేదని అధికారులు అసంతృప్తితో ఉన్నారు. మరో పదిరోజుల పోలీసు కస్టడీ మంజూరు చేయాలని కోర్టును కోరనున్నారు. ఇదే కేసులో సోమవారం అరెస్టయిన ప్రొఫెసర్‌ మురుగన్‌ను బుధవారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement