ప్రాణం తీస్తున్న నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

ప్రాణం తీస్తున్న నిర్లక్ష్యం

Published Fri, Feb 1 2019 1:05 PM

Road Accidents Awareness in PSR Nellore - Sakshi

రోడ్డుపై వెళ్లేప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న నిర్లక్ష్యం పలువురి ప్రాణాలను తీస్తోంది. వాహనదారుల అజాగ్రత్త, నిబంధనల అతిక్రమణ, మితిమీరిన వేగం, రహదారిపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలపడం తదితర కారణాలతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ విషయాన్ని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కావలి నుంచి తడ వరకు, నెల్లూరు నుంచి మర్రిపాడు వరకు జాతీయ రహదారులపై 150 బ్లాక్‌స్పాట్‌లను అధికారులు గుర్తించారు. అందులో 60 ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసు శాఖ చెబుతోంది. ఈ ప్రాంతాల్లో వేగ నియంత్రణను సూచించే సైన్‌బోర్డులు, స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సిన అసవరం ఉంది. కావలి రూరల్‌ మండలంలోని రుద్రకోట, మద్దూరుపాడు క్రాస్, గౌరవరం, అలిగుంటపాలెం క్రాస్, సున్నపుబట్టి, కమ్మపాళెం, నార్తురాజుపాళెం, కొడవలూరు ఆంజనేయస్వామిగుడి సమీపం, ప్రశాంతినగర్‌ క్రాస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌నగర్‌ క్రాస్, చింతారెడ్డిపాళెం క్రాస్, ఎస్వీజీఎస్‌ కళాశాల, నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల, గొలగమూడి క్రాస్‌ రోడ్డు, సుందరయ్యకాలనీ, బుజబుజనెల్లూరు, సర్వేపల్లి క్రాస్‌ రోడ్డు, కొమ్మలపూడి క్రాస్‌ రోడ్డు, బద్దవోలు క్రాస్‌ రోడ్డు, ఆదిశంకర ఇంజినీరింగ్‌ కళాశాల క్రాస్‌ రోడ్డు, చిల్లకూరు, వరగలి క్రాస్‌ రోడ్డు, మల్లాంరోడ్డు జంక్షన్, నాయుడుపేట, నెల్లబల్లి, రాజుపాళెం, హోలీక్రాస్‌ జంక్షన్, కోటపోలూరు క్రాస్‌ రోడ్డు, తడ కారూరుమిట్ట, పెళ్లకూరు, అదేక్రమంలో ముంబై జాతీయ రహదారిలోని బుచ్చిరెడ్డిపాళెం, సంగం సమీపంలో, నెల్లూరుపాళెం, డీసీపల్లి, మర్రిపాడు సమీపంలో నందవరం తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.

జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది
రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని చెప్పలేం. జరిగిన ప్రమాదాలు డ్రైవర్‌ తప్పిదంతో చోటుచేసుకున్నవి కావని పలు కేసుల విచారణలో వెల్లడైంది. ప్రయాణం సాఫీగా సాగించాలంటే, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలంటే రహదారుల భద్రతో ఎంతో ముఖ్యం. ప్రధానంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో రోడ్‌సేఫ్టీ విభాగం ఏర్పాటు చేశారు. హైవేలపై వేగ నియంత్రణ, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే రోడ్‌ సేఫ్టీ విభాగం కేవలం కంటితుడుపు చర్యలకే పరిమితమైందన్న ఆరోపణలున్నాయి.

వాహనాలు నిలపకుండా చూడాలి
రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను మరో వాహనం ఢీకొనడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందు వెళ్లే వాహనాలు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా ఆపడం, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుమీదనే భారీ వాహనాలు నిలపడంతో వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక ఢీకొంటున్నాయి. నిబంధనల మేరకు వాహనాలకు ముందు, వెనుక రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్లు అతికించాలి. ఈ స్టిక్కర్లు రాత్రి వేళల్లో వాహనచోదకుడికి ముందు వాహనం ఉందనే విషయాన్ని స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. దీంతో వాహనదారుడు జాగ్రత్త పడతాడు. ప్రమాదం నుంచి బయటపడతాడు.

అందువల్లే..
అధికారుల సమాచారం మేరకు మితిమీరిన వేగం, మద్యం మత్తు, ఓవర్‌టేక్, అకస్మాత్తుగా వాహనం నిలుపుదల చేయడం, ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, రోడ్డు పక్కన వాహనం పార్కింగ్‌ తదితరాలు ప్రమాదానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గుర్తించిన ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు కనీస చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కూడళ్లలో వేగ నియంత్రణతోపాటు హెచ్చరిక బోర్డులు ఉండాలి. వాటిని ఏర్పాటు చేయకపోవడంతో వేగంగా వచ్చే వాహనాలు కూడళ్లల్లో ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

చర్యలు తీసుకుంటున్నాం
రోడ్డుప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్‌స్పాట్‌లు గుర్తించాం. రోడ్లుపై వాహనాలు నిలపకుండా సాధ్యమైనంత మేర చర్యలు చేపడుతున్నాం. వాహనచోదకులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తున్నాం.– ఐశ్వర్యరస్తోగి, జిల్లా ఎస్పీ

కొన్ని ఘటనలు
ఝ    ఇటీవల పూజా సామగ్రి కోసం వెళ్లిన పి.శంకర్‌ అనే వ్యక్తి కారూరుమిట్ట వద్ద లారీ ఢీకొని మృతిచెందాడు
ఝ    గత నెల 8వ తేదీన ముంగమూరు వద్ద ద్విచక్ర వాహనదారుడు చేసిన చిన్నతప్పిదం వల్ల ఆర్టీసీ బస్సు బోల్తా పడి 27 మందికి గాయాలయ్యాయి.
ఝ    గత నెల 4వ తేదీన వెంకటగిరి సమీపంలో ఆటో బోల్తాపడి 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఝ    గత నెల 13వ తేదీన సంగం మండలంలోని ర్యాంపు వద్ద లారీ ఢీకొని ముగ్గురు మృతిచెందారు.
ఝ    గత నెల 17వ తేదీ మర్రిపాడు మండలంలోని నందవరం వద్ద హైవేపై ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి కారు ఢీకొంది. దీంతో నలుగురు చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
Advertisement