అమ్మను వేధిస్తే.. అంతే!  | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని కష్టపెట్టి కటకటాలపాలు 

Published Tue, Jul 23 2019 1:21 AM

Son Jailed For Torturing Mother In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘అడ్డాలనాడు బిడ్డలు.. కానీ, గడ్డాలనాడా?’అని ఒక నానుడి. అయితే, ఈ కొడుకు అమ్మను ఆదరించకపోగా బెదిరించసాగాడు. అమ్మపాలిట గండమయ్యాడు. కన్నతల్లిని కష్టపెట్టి కటకటాలపాలయ్యాడు. ఇల్లు లేకుండా చేయబోయి జైలు పాలయ్యాడు. అత్తకు చేదోడువాదోడుగా ఉండాల్సిన కోడలు భర్తకే వత్తాసు పలికింది. చివరికి ఇద్దరూ కలసి ఊచలు లెక్కిస్తున్నారు. వారికి హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి న్యాయస్థానం రెండేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. వివరాలు... నేరేడ్‌మెట్‌లోని కాకతీయనగర్‌ కాలనీకి చెందిన జీఈ ప్రేమకుమారి(66)కి ముగ్గురు కుమారులు, కుమార్తె. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. 2013 అక్టోబర్‌ 23న ప్రేమకుమారి భర్త చనిపోయాడు. ప్రైవేటు ఉద్యోగి అయిన పెద్ద కుమారుడు ఎం.అమిత్‌కుమార్‌ కన్ను తల్లి ఇంటిపై పడింది. దాన్ని ఆక్రమించుకోవాలని భార్యతో కలసి కుట్ర చేశాడు. ఇద్దరూ 2015 ఫిబ్రవరిలో ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు.

అంతటితో ఆగకుండా ఆ ఇంటిని తమ పేరిట రెగ్యులరైజ్‌ చేయించుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరూ ప్రేమకుమారిని మానసికంగా వేధించసాగారు. తీవ్రస్థాయిలో దుర్భాషలాడేవారు. ఇల్లు వదిలి వెళ్లిపోవాలని బెదిరించేవారు. 2015 అక్టోబర్‌ 13న ప్రేమకుమారి బయటకు వెళ్లి వచ్చేసరికి కొడుకు, కోడలు ఆమె గదికి తాళం వేసేశారు. లోపలకి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. కొడుకు, కోడలు వేధింపులు రోజురోజుకూ ఎక్కువవడంతో విసుగు చెందిన ప్రేమకుమారి అదేరోజు నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులపై మల్కాజ్‌గిరి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం అమిత్, లావణ్యలను దోషులుగా తేల్చింది. వీరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసులతోపాటు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నవీన్‌కుమార్‌ను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ ఎం.భగవత్‌ అభినందించారు. 
 

Advertisement
Advertisement