Sakshi News home page

వేసవి చోరీల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు

Published Thu, Apr 5 2018 11:45 AM

Special Force For Summer Robberies - Sakshi

అనకాపల్లి టౌన్‌: వేసవిలో జరిగే దొంగతనాలకు అడ్డు కట్టవేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అడిషినల్‌ క్రైం ఎస్పీఎన్‌.జె.రాజ్‌కుమార్‌ తెలిపారు.  స్థానిక పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో  తీర్థయాత్రలకు వెళ్లే కుటుంబాలు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేస్తే ఒక రోజు ముందుగా వారికి గృహాలకు ఉచితంగా లాక్డ్‌ హౌసింగ్‌ మానిటర్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌)ను   ఏర్పాటు చేస్తామని  తెలిపారు.గృహాలకు తాళాలు వేసి మేడపై నిద్రించేవారు   అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.  అనకాపల్లి పట్టణ పరిధిలో రాత్రి వేళ గస్తీకి ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి, పాయకరావుపేట, బుచ్చియ్యపేట మండలాల్లో ప్రత్యేకంగా రెండు బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

రూరల్‌ ప్రాంతంలో  రెండు బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత వ్యక్తులు  సంచరిస్తే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.  పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరులో జరిగిన చోరీ కేసులో ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ద్వారా ఆరు నిమిషాల్లో దొంగను పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై కరపత్రాలు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రధాన రహదారులు, బ్యాంక్‌లు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమోరాల ద్వారా నిఘా కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు.  జిల్లాలో ఈ ఏడాది నేరాలు తగ్గించేందకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో క్రైం డీఎస్పీ అలియాస్‌ సాగర్, డీఎస్పీ కె.వెంకటరమణ, పట్టణ సీఐ మురళీరావు, రూరల్‌ సీఐ రామచంద్రరావు, ఎస్‌ఐలు వి.శ్రీనివా సరావు, అల్లు వెం కటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement