నారీమణులకు రక్ష | Sakshi
Sakshi News home page

నారీమణులకు రక్ష

Published Wed, Nov 8 2017 6:36 AM

special team for woman protect - Sakshi

తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలో మహిళల రక్షణే ధ్యేయంగా ఎస్పీ అభిషేక్‌ మొహంతి చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న షీటీం, రక్షక్‌ బృందాలకు తోడుగా యాంటీ ర్యాపిడ్‌ యాక్షన్‌ టీంలను నియమిస్తున్నారు. దీంతో తిరునగరంలో మహిళలకు మరింత భద్రత లభించనుంది.

తిరుపతిక్రైం: ‘నేను స్కూల్‌కు వెళుతుంటే .. ఓ వ్యక్తి వారం రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపుల మరీ ఎక్కువయ్యాయి.. పోకిరీల బారి నుంచి నన్ను కాపాడండి’ అంటూ ఓ బాలిక డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. సమాచారం అందుకున్న ఓ బృందం రంగంలోకి దిగింది. సదరు  ఆ విద్యార్థినిని అనుసరించింది. ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టి  సమర్థవంతంగా పోకిరీలకు చెక్‌పెట్టింది. ఇప్పటి వరకు తిరుపతి అర్బన్‌ జిల్లాలో షీటీమ్,  రక్షక్‌ టీమ్‌లు  మహిళల రక్షణ చర్యలు చేపట్టేవి. వీటికితోడు ఇప్పుడు కొత్తగా రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇకపై అర్బన్‌ జిల్లాలో ఈ టీమ్‌ కూడా మహిళలకు అందుబాటులో ఉంటుంది. మహిళలపై వేధింపులు ఇతరత్రా నేరాలు పెరగడంతో భద్రతలో భాగంగా పోలీసు విభాగం మహిళల భద్రత కోసం కొత్త విభాగాలను  ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రస్తుతం జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలు సుమారు వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో సుమారు 30 శాతం వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. మహిళలను వేధిస్తున్నవారిలో యువకులు, విద్యార్థులతో  పాటు ఉద్యోగులూ ఉన్నారు. ఇందులో 30 నుంచి 50 ఏళ్ల పురుషులు ఎక్కువమంది ఉంటున్నారు.

షీ టీమ్‌ పనితీరు ఇలా
జిల్లా కేంద్రమైన ప్రధాన బస్టాండులో కాలేజీలు, ఆటోలల్లో ఇతర ప్రాంతాల్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో షీటీమ్‌లు నిఘాపెడుతున్నాయి. సిటీ బస్సుల్లో కాలేజ్‌ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో షీ బృందాలు కలసిపోతున్నాయి. ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరిస్తారు. పోకిరీలు రెచ్చిపోగానే సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించి వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. తమను ఎవరినీ వేధించడంలేదంటూ నిందితులు తప్పించుకునే వీలులేకుండా కెమెరా  దృశ్యాల సాక్ష్యంగా చూపిస్తున్నారు. తొలిసారి చిక్కితే కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తారు. మరోసారి తప్పు చేయనని లిఖిత పూర్వకంగా రాయించుకుని వదలిపెడుతున్నారు. రెండవ సారి మహిళలను వేధిస్తూ చిక్కితే వెంటనే వారిపై వివిధ సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వాట్సప్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు డయల్‌ 100కు ఫోన్‌ చేసినా మెసేజ్‌ పంపినా షీ బృందాలకు సమాచారం అందిస్తారు.  ఉదయం 8 నుంచి 10 గంటలు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ప్రధాన ప్రాంతాలైన బస్టాండులు, కాలేజీ అడ్డాలలో షీటీమ్‌లు మాటు వేస్తాయి. పోకిరీలను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తున్నాయి.

మహిళా రక్షక్‌ : నిరంతరం మహిళల భద్రత కోసం వాహనాల్లో నగర శివార్లు, చిన్న చిన్న గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. ఏదైనా మహిళలపై అవాంఛనీయ సంఘటనలు జరిగినా, చిన్నపిల్లలను వేధించినా, బాల్య వివాహాలకు ప్రయత్నించినా ఈ టీమ్‌లు వెంటనే వారికి బుద్ధి చెబుతాయి. ఎప్పకప్పుడు జరిగిన సంఘటనలు ఉన్నతాధికారులకు తెలుపుతూ వారి సూచనల మేరకు నడుచుకుంటూ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటారు. అంతేగాకుండా గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో స్కూళ్లకు నిలిచిపోయిన విద్యార్థులను స్కూళ్లకు తరలించడం, బడిఈడు పిల్లలు పనులకు వెళుతుంటే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి గృహాలకు తరలించడం తదితర మహిళల భద్రత కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అండగా ఉంటున్నాయి.

నూతనంగా మహిళా రెస్పాన్స్‌ టీమ్‌
మహిళలకు అత్యాధునిక భద్రత కల్పించేందుకు అర్బన్‌ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆధ్వర్యంలో నూతనంగా మహిళా రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా వెంటనే వీరు పరిష్కరిస్తారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మహిళలను వేధించినా, బాధపెట్టినా, వరకట్న వేధింపులకు పాల్పడినా, బాల్య వివాహాలు చేసినా, చిన్న వయస్సులో బాలికలను వ్యభిచార గృహాలకు విక్రయించిన వారి ఆట కట్టించేందుకు ఈ టీమ్‌ పని చేస్తుంది. ట్రాఫిక్‌ డీఎస్పీ సుకుమారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఈ టీమ్‌లో 18 మంది మహిళా సిబ్బంది సేవలందించనున్నారు.

మహిళల కోసం ప్రత్యేక చట్టాలు
మహిళల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు, విభాగాలు ఉన్నాయి.  ఇప్పటికే అర్బన్‌   జిల్లాలో మహిళల భద్రత కోసం కోసం షీటీమ్, మహిళా రక్షక్‌ ఉండగా తాజాగా రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరం మహిళలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే లక్ష్యంగా ఈ టీమ్‌ను ప్రారంభించడం జరిగింది. మహిళల కోసం ఇప్పటికే పోలీసు వాట్సాప్‌ 8099999977 ఉంది. ప్రత్యేకంగా 8500069777 అందుబాటులోకి తీసుకువచ్చాం.  ప్రతి ఒక్కరూ  దీనిని సద్వినియోగం చేసుకోవాలి.  
– మహిళా రక్షక్,రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ఇన్‌చార్జి డీఎస్పీ సుకుమారి

Advertisement

తప్పక చదవండి

Advertisement