ప్రాణాలు తీసిన అర్ధరాత్రి అతివేగం | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన అర్ధరాత్రి అతివేగం

Published Fri, May 4 2018 1:42 PM

Speed Driving Kills One Man In PSR Nellore - Sakshi

నెల్లూరు (వేదాయపాళెం): మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్‌ వంతెనపై గురువారం తెల్లవారు జామున జరిగింది. నెల్లూరురూరల్‌ పోలీసుల కథనం మేరకు.. కొత్తూరు టైలర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ ఇమ్రాన్‌ (23), నగరంలోని కోటమిట్టకు చెందిన జమీర్‌ స్నేహితులు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. ఎల్‌జీ కంపెనీలో పనిచేస్తున్నారు. బుధవారం కావలికి ఏసి మరమ్మతు పనుల కోసం కంపెనీ తరఫున వెళ్లారు. అక్కడ రాత్రి 1 గంట వరకు పనిచేసి మోటారు సైకిల్‌పై తిరిగి నెల్లూరుకు వెనుదిరిగారు. వెంకటేశ్వరపురం ఫ్లై ఓవర్‌ వంతెన దిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం బైక్‌ను డీకొంది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. జమీర్‌కు తీవ్రగాయాలు కావటంతో నారాయణ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైకు తరలించారు. ఇమ్రాన్‌ మృతదేహనికి నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నెల్లూరురూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.    

రెండు బైక్‌ల ఢీ: ఒకరి దుర్మరణం  
చిల్లకూరు: స్నేహితులు కొందరు మితిమీరిన వేగంతో రెండు బైక్‌ల్లో వెళ్తూ అదుపు తప్పి ఒక్కదాన్ని మరొకటి ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మన్నేగుంట సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీ సుల సమాచారం మేరకు.. మండలం లోని మోమిడి గ్రామంలో జరుగుతున్న వేమాలమ్మ తిరునాళ్ల సందర్భంగా మన్నేగుంటలో బుధవారం రాత్రి జరిగిన అమ్మవారి ఉత్సవానికి వరగలి, మన్నేగుంట గ్రామాలకు చెందిన ఐదుగురు స్నేహితులు రెండు బైక్లపై అతి వేగంగా వెళ్తున్నారు. మన్నేగుంట సమీపంలోని కల్వర్టు వద్ద ఒకదానికి ఒకటి ఢీ కొనడంతో వరగలికి చెందిన పూడి మహేష్‌ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మనోహర్, పవన్, సురేష్, శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మనోహర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతి చెందిన మహేష్‌ మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement