ప్రేమజంటపై దాడి : తెరపైకి కొత్త అనుమానాలు | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై దాడి : ఇది ముమ్మాటికి పరువు హత్యే!

Published Mon, Feb 25 2019 6:42 PM

Sridharani Murder Case Turned Into Mystery - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారంలో తెరపైకి కొత్త అనుమానాలు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడికే మృతిచెందగా, గాయాలతో ప్రేమికుడు నవీన్‌ బయటపడ్డారు. కాగా సోమవారం శ్రీధరణి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. యువతిపై ఎటువంటి అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టంలో వెల్లడేనట్లు తెలుస్తోంది. యువతి తలపై బలంగా కర్రతో కొట్టడం వల్లే చనిపోయిందని నిర్ధారించారు. ప్రేమికుడు నవీన్‌ తల వెనుకభాగంలో ఐదు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ కూర్చొని ఉండగా దుడ్డుకర్రతో వెనుకవైపు నుంచి వచ్చి కొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. (కలకలం రేపిన యువతి హత్య)

ఇది ముమ్మాటికి పరువు హత్యే
శ్రీధరణిది ముమ్మాటికి పరువు హత్యేనని నవీన్‌ తరపు గ్రామస్థులు చెబుతున్నారు. నవీన్‌, శ్రీధరణిలు ప్రేమించుకోవడం అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, వారి బంధువులే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. నవీన్‌ చాలా అమాయకుడు. శ్రీధరణి, నవీన్‌లు ప్రేమించుకోవడం అమ్మాయి కుటుంబ సభ్యలకు ఇష్టం లేదు. త్వరలోనే అమ్మాయికి సొంత బావతో వివాహం చేయాలని శ్రీధరణి కుటుంబ సభ్యులు భావించారు. అమ్మాయికి ఇష్టంలేదని చెప్పి.. తాను నవీన్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇది ఇష్టం లేకనే అమ్మాయి బావ, మామ ఇద్దరూ కిరాయి ముఠాతో ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నాం’ అని నవీన్‌ గ్రామస్తులు ఆరోపించారు. అమ్మాయి బంధువులను అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్‌ వ్యవహార తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో అతను పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారిస్తున్నారు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్‌.. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ముగ్గరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.(ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం)

Advertisement
Advertisement