డబ్బు కోసమే శ్రీనాథ్‌ హత్య?

10 Jan, 2020 09:28 IST|Sakshi
రీపోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యం ( ఇన్‌సెట్‌లో ) శ్రీనాథ్‌ ఫైల్‌

అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన యువకుడు

తహసీల్దార్‌ సమక్షంలో మృతదేహానికి రీ పోస్టుమార్టం

విచారణను వేగవంతం చేసిన పోలీసులు

అనంతపురం,ధర్మవరం టౌన్‌: సీకేపల్లి మండలం బసినేపల్లి రైల్వేగేట్‌ వద్ద అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన యువకుడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహానికి సంబంధించి బంధువులు ఆచూకీ గుర్తించడంతో తహసీల్దార్‌ సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. గత యేడాది డిసెంబర్‌ 19న సీకేపల్లి మండలం బసినేపల్లి రైల్వేగేట్‌ వద్ద అనుమానాస్పదస్థితిలో పడివున్న యువకుడి మృతదేహాన్ని కీ మ్యాన్‌ దస్తగిరి గుర్తించారు. అయితే మృతుని ఆచూకీ లభించకపోవడంతో ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో పంచనామా నిర్వహించి పోలీసులు ఖననం చేశారు. ఇటీవల మీడియా ముఖంగా మృతుని ఫొటోలను పోలీసులు పలు పోలీస్‌స్టేషన్‌లలో ప్రదర్శించడంతో మృతుని ఆచూకీ లభించింది. మృతుని తల్లి సుజాత బంధువులు ఫొటోలో ఉన్నది తమ కుమారుడేనని పోలీసులకు తెలిపారు. మృతుని పేరు శ్రీనాథ్‌ (29) అని పెనుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడని పోలీసులకు తెలిపారు.

తహసీల్దార్‌ సమక్షంలో రీ పోస్ట్‌మార్టం
ధర్మవరం తహసీల్దార్‌ హరిప్రసాద్‌ సమక్షంలో మృతదేహానికి ప్రభుత్వ వైద్యురాలు శ్రీలత ఆధ్వర్యంలో గురువారం రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ధర్మవరం శ్మశానంలో ఖననం చేసిన శవాన్ని వెలికితీసి రీ పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం డీఎన్‌ఏ పరీక్షల కోసం శ్యాంపుల్స్‌ను సేకరించారు.

రూ.9 లక్షల కోసమే హత్య
యువకుడు శ్రీనాథ్‌ డిసెంబర్‌ 18న ప్రభుత్వ మద్యం దుకాణంలో వసూలైన రూ.9 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నానని తల్లితో చెప్పి వెళ్ళాడని బంధువులు చెబుతున్నారు. అయితే అప్పటి నుండి ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేశాడని, డబ్బుల కోసమే దుండగులు హత్య చేసి ఉంటారని మృతుని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు నిగ్గు తేలనున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా