కిరాయి హత్యలకు తెగబడిన ‘తమ్ముళ్లు’! | Sakshi
Sakshi News home page

కిరాయి హత్యలకు తెగబడిన ‘తమ్ముళ్లు’!

Published Sun, Jul 1 2018 4:46 AM

TDP Leaders doing the murders - Sakshi

సాక్షి, విజయవాడ: రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు.. కిరాయి హత్యలకూ తెగబడుతున్నారు. బెజవాడ రౌడీలను పంపించి ఇతర జిల్లాల్లోనూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని  హత్య చేసేందుకు పథకం రచించారు. అయితే విజయవాడ సీసీఎస్‌ పోలీసులు, విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. ఈ కేసులో నిందితుల్ని తప్పించేందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి.ఈ కేసులో కీలక నిందితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పరిచయం ఉండటంతో ఇప్పటికే ఆయన్ను తప్పించారు. దీంతో అతను పరారీలో ఉన్నాడు. 

రూ.కోటికి డీల్‌ ..
శ్రీకాకుళం జిల్లా రాజాంలోని రూ.9 కోట్ల విలువైన ఓ ఆస్తి విషయంలో కీలకమైన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని హత్య చేసేందుకు ప్రత్యర్థులు విజయవాడ తెలుగుదేశం పార్టీ నేతల సహాయం కోరినట్లు తెలిసింది. విజయవాడకు చెందిన ఒక కార్పొరేటర్‌ వద్దకు ఈ సెటిల్‌మెంట్‌ వచ్చింది. ఆయన సూచన మేరకు అర్బన్‌ తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిధి దిట్టకుర్తి వీరరాఘవ ఉదయ్‌కుమార్‌ (డీవీఆర్‌ ఉదయ్‌కుమార్‌) రంగంలోకి దిగి రియల్టర్‌ హత్యకు రూ.కోటి కిరాయికి బేరం కుదిర్చాడు. వ్యాపారిని హత్య చేసే పథకంలో భాగంగా చీపురుపల్లిలోని నటరాజ్‌ రెసిడెన్సీలో ఉదయ్‌కుమార్‌ మూడు రూమ్‌లు బుక్‌ చేశాడు. విజయవాడ నుంచి 9 మంది కిరాయి రౌడీలను అక్కడకు తీసుకువెళ్లాడు. జూన్‌ 12న వారంతా హోటల్‌లో దిగారు. జూన్‌ 17 వరకు హోటల్‌లో ఉండి వ్యాపారిని హత్య చేసేందుకు పూర్తి రెక్కీ నిర్వహించారు. వ్యాపారి తిరిగే ప్రదేశాలను గుర్తించారు. ఆయా రూట్లలో ఎక్కడెక్కడ నిఘా కెమెరాలు లేవో గుర్తించారు. వ్యాపారస్తుడ్ని ఎక్కడ హత్య చేస్తే ..పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవచ్చో  చర్చించుకుని..ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత విజయవాడ వచ్చేశారు. హత్యా ప్రణాళికను అమలు చేసేందుకు 22వ తేదీన చీపురుపల్లి వచ్చి అదే హోటల్‌లో దిగారు. ఒకటి రెండు రోజుల్లో పని పూర్తిచేసుకుని వెళదామనే లోగానే పోలీసులు  ఈ కుట్రను భగ్నం చేశారు. 

ఒక నేరస్తుడి కోసం నిఘా పెడితే..
ఈ హత్య కోసం విజయవాడ నుంచి రాజు, రాము, మణి, సాహిద్, పాండు తదితరులు చీపురుపల్లి వెళ్లారు.  ఇందులో సాదిక్‌ పై గతంలో రేప్‌ కేసు ఉంది. కొద్ది రోజులుగా సాహిద్‌  కనపడకపోవడంతో అనుమానం వచ్చిన విజయవాడ సీసీఎస్‌ పోలీసులు అతని ఫోన్‌ నంబర్‌ను ట్రాకింగ్‌ చేశారు. దీంతో సాదిక్‌ చీపురుపల్లిలో ఉంటున్నట్లు గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు తీగలాగితే  వ్యాపారి హత్య కుట్ర బయటపడింది. విజయవాడ సీసీఎస్‌ పోలీసులు జూన్‌ 23న చీపురుపల్లి పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో వారు నటరాజ్‌ రెసిడెన్సీపై దాడి చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విజయవాడ సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడు డీవీఆర్‌ ఉదయ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. 

పోలీసులతో రాయబేరాలు.. 
నిందితుల్ని విజయవాడకు తీసుకురాగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఇద్దరు రంగంలోకి దిగారు. ఓ దశలో నిందితుల్ని తప్పించేందుకు రూ.15లక్షల వరకు పోలీసులతో బేరం ఆడినట్లు సమాచారం. హత్య చేయడానికి వెళ్లిన వారిలో కేసులు లేనివారిని తొలుత వదిలేసి... తరువాత మిగిలిన వారిని వదిలివేయాలని సూచించారు. అవసరమైతే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు తీసుకువెళతామని పోలీసులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement