అమ్మను చూస్తానంటే కుమ్మేశాడు!     | Sakshi
Sakshi News home page

అమ్మను చూస్తానంటే కుమ్మేశాడు!    

Published Thu, Jun 28 2018 1:38 PM

Teacher Beats Boy In Nizamabad - Sakshi

మద్నూర్‌(జుక్కల్‌) నిజామాబాద్‌ : విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా రబ్బరు పైపుతో చితకబాదిన సంఘటన మద్నూర్‌లోని బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మెదక్‌ జిల్లా తిమ్మానగర్‌కు చెందిన కంబాల రక్షిత్‌కు మద్నూర్‌ గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో సీటు వచ్చింది.

రక్షిత్‌ తండ్రి కంబాల నర్సయ్య దినసరి కూలీ. పేదరికంలో ఉన్న తన కుమారుడికి మద్నూర్‌ గురుకుల పాఠశాలలో సీటు రావడంతో వారు తమ కుమారుడి భవిష్యత్తు బాగుంటుందని చేర్పించారు. పక్షం రోజుల క్రితం రక్షిత్‌ అమ్మానాన్న బాగా గుర్తుకు వస్తున్నారని ఒకసారి ఇంటికి వెళ్లిరావడానికి అనుమతించాలని ఉపాధ్యాయుడు సంతోష్‌ను కోరాడు.

దీంతో ఆగ్రహానికి గురైన సదరు ఉపాధ్యాయుడు ఇంటికి ఎందుకు వెళ్తావని రబ్బరు పైపుతో విచక్షణ రహితంగా వీపు, భుజం, కంటిపై కొట్టడంతో రక్షిత్‌ ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోయాడు. వారం క్రితం ఇంటికి వెళ్లిన రక్షిత్‌ ఒంటిపై తీవ్ర గాయాలను చూసిన రక్షిత్‌ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో గత వారం పాఠశాలకు విద్యార్థిని తెచ్చి సిబ్బందిపై వారు తీవ్రంగా మండిపడ్డారు.

చదువుకునేందుకు వచ్చిన విద్యార్థిని ఇలాగే చూస్తారా.. మీ కొడుకును కూడా ఇలాగే తీవ్ర గాయాలయ్యేలా కొడతారా అని వారు గొడవ పడ్డారు. రక్షిత్‌కు ఎవరు కొట్టలేదని ఆ గాయాలతో తమకు సంబంధం లేదని సదరు ఉపాధ్యాయుడు, ప్రిన్స్‌పాల్‌ చెప్పారని విద్యార్థి తండ్రి వాపోయాడు. దీంతో మంగళవారం రక్షిత్‌ను తీసుకుని హైదరాబాద్‌లోని నాంపల్లిలో గురుకుల పాఠశాలల కమిషనర్‌కు పరిస్థితిని వివరించామన్నారు.

తమకు మరోచోట సీటు కేటాయించాలని కోరామని చెప్పాడు. ప్రస్తుతం సీట్లు ఖాళీ లేవని అదే పాఠశాలలో చేరాలని వారు సూచించడంతో బుధవారం పాఠశాలకు వచ్చామన్నారు. పాఠశాలలో రక్షిత్‌కు ఏం జరిగిన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని రాసిస్తే తిరిగి రక్షిత్‌ను పాఠశాలలో చేర్చుకుంటామని ప్రిన్స్‌పాల్‌ శ్రీనివాస్‌ చెప్పాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలా రాసిస్తారని, అలా రాసివ్వడం కుదరదని నర్సయ్య చెప్పడంతో విద్యార్థికి పాఠశాలలో చేర్చుకోవడం కూడా కుదరదని వారు ఖరాకండిగా చెప్పారని, దీంతో రక్షిత్‌ పెట్టె, దుస్తులు, పుస్తకాలు తీసుకుని వెళ్లిపోతున్నామని ఆయన రోదిస్తూ పేర్కొన్నాడు. నిరుపేదలమైన తమ కుమారుడికి గురుకులంలో సీటు వచ్చిందని సంబరపడిపోయామని, ఇట్ల జరుగుతందని అనుకోలేదని ఆయన ఆవేనద వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులు సదరు పాఠశాల ప్రిన్స్‌పాల్, ఉపాధ్యాయుడిని కఠిన చర్యలు తీసుకోవాలని నర్సయ్య కోరాడు. 

విద్యార్థిని ఎవరూ కొట్టలేదు 

రక్షిత్‌కు పాఠశాలలో ఎవరూ కొట్టలేదు. వారం క్రితం హోంసిక్‌ సెలవులకు వెళ్లిన రక్షిత్‌ను వాళ్ల అమ్మ చితకబాదడంతో రక్షిత్‌కు గాయాలయ్యాయి. విద్యార్థి మాత్రం సంతోష్‌ సార్‌ చితకబాదాడని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించగా రక్షిత్‌ను తీసుకుని రండి మాట్లాడుదాం అని ప్రిన్స్‌పాల్‌ అన్నాడు. రక్షిత్‌ పాఠశాలలో చదవడం ఇష్టం లేకనే వెళ్లిపోయాడని తమకు ఏ సంబంధం లేదు.         -శ్రీనివాస్, ప్రిన్సిపాల్, మద్నూర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement