టీనేజ్‌ చీర్‌... ఫుల్‌ బీర్‌ | Sakshi
Sakshi News home page

టీనేజ్‌ చీర్‌... ఫుల్‌ బీర్‌

Published Thu, May 3 2018 1:52 PM

Teenegers Entry inBars And Pubs With Fake Id Proofs - Sakshi

సాక్షి, సిటీబ్యూరో  : నగరంలోని బార్లు, పబ్‌లలో టీనేజర్ల జోష్‌ పెరిగింది. కలర్‌ జిరాక్స్‌లతో ఫేక్‌ ఐడీలు సృష్టిస్తున్న వీరు... మధ్యాహ్నం బార్లు, రాత్రిళ్లు పబ్‌లలో ఎంజాయ్‌చేస్తున్నారు. ఇటీవల ఆబ్కారీ శాఖ కొన్ని పబ్‌లలోతనిఖీలు నిర్వహించగా... అక్కడ 60 శాతం టీనేజర్లే ఉన్నట్లు తేలింది. 21 ఏళ్లలోపు యువతీ యువకులకు మద్యం విక్రయించడం, సరఫరా చేయడం చట్టరీత్యా నేరం. దీంతో దాదాపు ఏడు పబ్‌లకు ఆబ్కారీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు వేసవిలో బీర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. నిత్యం సుమారు 1.30 లక్షల లీటర్ల బీర్‌ను యూత్‌ తాగేస్తోంది. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి 30వేల లీటర్లు అదనంగా పెరగడం గమనార్హం. యూత్‌ జోష్‌తో గ్రేటర్‌లోని బార్లు, పబ్‌లలో బీర్ల సేల్స్‌ ఊపందుకున్నాయి. 

ఫేక్‌ ఐడీలతో పగలు బార్‌లు.. రాత్రి పబ్‌లు..
పలువురు టీనేజ్‌ యువత పగలు బార్లు.. రాత్రిళ్లు పబ్‌లకు వెళుతూ ఫుల్లు జోష్‌లో మునిగితేలుతున్నట్లు ఆబ్కారీశాఖ పరిశీలనలో తేలింది. ప్రధానంగా 21 ఏళ్లలోపు యువత కొందరు నకిలీ ఐడీ కార్డులను సృష్టిస్తుండగా.. మరికొందరు ఇతరుల ఐడీకార్డులను కలర్‌జిరాక్స్‌ తీసి తమ వయస్సు 21 ఏళ్ల కన్నా అధికంగా ఉన్నట్లు చూపుతూ బార్లు, పబ్‌ల్లోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక పలు బార్లు, పబ్‌ల యజమానులు ఈ ధ్రువపత్రాలను సైతం సరిగా పరిశీలించడం లేదని తేలడం గమనార్హం.   

60 శాతం టీనేజర్స్‌..
బార్‌లు, పబ్‌లలోకి ప్రవేశిస్తున్న యువతరంలో 60 శాతం మంది టీనేజర్స్‌ ఉంటున్నట్లు తేలడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా టీనేజ్‌ యువత తమకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌మనీతో బార్లు, పబ్‌లలో మిత్రులతో కలిసి జల్సా చేసేస్తున్నట్లు తేలింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. తమ పిల్లలు ఎటు వెళ్తున్నారు.. ఏమి చేస్తున్నారన్న అంశంపై నిఘా పెట్టాలని  వ్యక్తిత్వవికాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు. .

ఏడు పబ్‌లకు నోటీసులు..
ఆబ్కారీశాఖ పరిశీలనలో ఇటీవల పలువురు టీనేజ్‌ యువత ఉన్నట్లు తేలడంతో నగరంలోని ఏడు పబ్‌లకు నోటీసులు జారీచేసినట్లు ఆబ్కారీశాఖ వర్గాలు తెలిపాయి. మరోసారి ఇదే తప్పిదం పునరావృతమైతే సదరు బారు లేదా పబ్‌ల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశాయి. అనుమానం వచ్చిన ప్రతీ టీనేజర్‌ను బార్‌ లేదా పబ్‌లోకి ప్రవేశించకుండా నిరోధించాలని, ఈ విషయాన్ని అందరికీ స్పష్టంగా కనిపించేలా నోటీసుబోర్డుపై ప్రదర్శించాలని స్పష్టం చేశాయి. టీనేజర్స్‌కు మద్యం సరఫరా చేస్తున్న పబ్‌లు, బార్లపై ప్రత్యేకంగా దృష్టిసారించడంతోపాటు వరుస తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాయి.

అమ్మకాల్లో చీర్స్‌...
మండుటెండల్లో గ్రేటర్‌లో బీర్ల సేల్స్‌ ఉప్పొంగుతున్నాయి. గత ఐదేళ్లుగా ఏప్రిల్, మే నెలల్లో ఎన్నడూ లేనివిధంగా నిత్యం 1.30 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఈ మోతాదు లక్ష లీటర్లేనని తెలిపాయి. గ్రేటర్‌ పరిధిలో నిత్యం రూ.20 కోట్ల విలువైన మద్యం, బీర్ల అమ్మకాలు జరుగుతాయి. ఇటీవలి కాలంలో బీర్ల అమ్మకాలు పెరగడంతో మద్యం అమ్మకాల విలువ రోజుకు రూ.24 కోట్లకు చేరినట్లు అంచనా. అంటే నెలకు సుమారు రూ.720 కోట్ల మేర మద్యాన్ని గ్రేటర్‌లో మందుబాబులు స్వాహా చేసేస్తుండడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement