నిద్రమత్తే ముంచింది! | Sakshi
Sakshi News home page

నిద్రమత్తే ముంచింది!

Published Thu, Apr 26 2018 11:24 AM

Two Died And Eight Injured In Road Accident Kurnool - Sakshi

ఎమ్మిగనూరురూరల్‌: డ్రైవర్‌ నిద్రమత్తు రెండు ప్రాణాలను బలిగొంది. బనవాసి–బోడబండ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..ఆదోనిలోని బీఎన్‌ టాకీస్‌ దగ్గర నివాసముంటున్న స్టీల్‌ సామాన్ల వ్యాపారి బలదేవ్‌సింగ్‌ కుటుంబ సభ్యులతో మంగళవారం సాయంత్రం తెలంగాణ గద్వాలలోని ఎల్లమ్మ దేవత దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గద్వాల నుంచి ఆదోనికి ఏపీ 09సీహెచ్‌ 8933 నంబర్‌ గల జైలో వాహనంలో బయలుదేరారు.

ఎమ్మిగనూరు మండలం బనవాసి–బోడబండ సమీపంలోకి రాగానే  ఆదోని నుంచి వేగంగా వస్తున్న ఏపీ02 టీబీ 1140 నంబర్‌ గల లారీని జైలో వాహనం ఢీకొంది. దీంతో జైలో వాహనం నుజ్జునుజ్జయింది. ఘటనలో డ్రైవర్‌ పక్కన కూర్చున్న బలదేవ్‌సింగ్‌(70), శాంత బాయి(65) వాహనంలో ఇరుక్కుపో యి అక్కడే ప్రాణాలు వదిలారు. సుజాత, శ్రీదేవి, పరిమిళ, చిన్నారులు జ్ఞానేశ్వరి, వీర్‌సింగ్, కుషాల్‌సింగ్, ప్రశాంత్, డ్రైవర్‌ ఇలియాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ ప్రసాద్‌ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మార్మోగింది. ప్రథమ చికిత్స అనంతరం బాధితులను ఆదోని, కర్నూలు ప్రభుత్వాతస్పత్రులకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

నిద్ర వస్తోందన్నా..
తెల్లవారుజామున సమయంలో నిద్ర వస్తుండడంతో విశ్రాంతి తీసుకుందామని బలదేవ్‌సింగ్‌ కుటుంబ సభ్యులను కోరానని, అయినా వారు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో బయలుదేరినట్లు డ్రైవర్‌ చెబుతున్నాడు. పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రి వద్దే ఎదురుగా వస్తున్న ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టబోయారని, అదృష్టవశాత్తు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. చివరకు తెల్లవారుజామున 4 గంటల సమయంలో బనవాసి వద్ద జైలో వాహనం లారీని ఢీకొంది. తెల్లవారిన తరువాత బయలుదేరి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement