ఆనందం ఆవిరి | Sakshi
Sakshi News home page

ఆనందం ఆవిరి

Published Sat, May 19 2018 11:36 AM

Two Members Died In Road Accident - Sakshi

సోంపేట శ్రీకాకుళం: ఇస్కలపాలెం గ్రామానికి చెందిన భీమారావు కుటుంబం అండమాన్‌కు వెళ్లి వలస జీవనం సాగిస్తుంది. పుట్టిన ఊరి మీద ప్రేమ, వారు నమ్మే దేవతలపై నమ్మకంతో ఏటా కుటుంబమంతా కలిసి స్వగ్రామం వస్తుంటారు. ఇక్కడ పండగ జరుపుకుని, పలు దేవాలయాలను దర్శించి తిరిగి ఆనందంగా అండమాన్‌ వెళ్లడం ఆనవాయితీ.

అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది స్వగ్రామానికి వచ్చిన ఆ కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై పాలవలస గ్రామం వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇస్కలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి సుమిత్రి, గోపాలరావు చిన్న కుమారుడు వాసుపల్లి భీమారావు(32), భీమారావు వదిన(అన్నయ్య భార్య) తమ్ముడు, కవిటి మండలంలోని చిన్న కర్రివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి హేమలమ్మ, సుందరరావు కుమారుడు రామారావు(28) మృతి చెందారు.

ఈ దారుణ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బారువ పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  వాసుపల్లి భీమారావు కుటుంబం 20 రోజుల క్రితం అమ్మవారి పండగలు నిర్వహించడానికి అండమాన్‌ నుంచి మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి వచ్చారు.

అమ్మవారి పండగలతో పాటు, ఫుణ్యక్షేత్రాలు సింహాచలం లక్ష్మీనరసింహా స్వామి, పూరి జగన్నాథ« స్వామి దేవాలయాలను కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ నెల 19వ తేదీన తిరిగి అండమాన్‌ వెళ్లడానికి ఓడ టిక్కెట్లు బుక్‌ చేసుకుని సిద్ధమయ్యారు. అన్ని అనుకున్నట్టు జరిగితే శుక్రవారం సాయంత్రం తిరిగి ప్రయాణానికి విశాఖపట్టణం చేరుకునేవారు.

అయితే లారీ రూపంలో వీరి కుటుంబ సభ్యులను మృత్యువు వెంటాడింది. ఆనంద ప్రయాణానికి అడ్డుపడింది. కవిటి మండలం చిన కర్రివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి రామారావు(వరుసకు బావ)తో కలిసి భీమారావు ద్విచక్రవాహనంపై గురువారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు. అక్కడ అండమాన్‌కు వెళ్లేందుకు ఓడ టిక్కెట్లు 19వ తేదీకి బుక్‌ చేసుకుని తిరిగి ఇస్కలపాలెం గ్రామానికి రావడానికి బైక్‌పై రెడీ అయ్యారు.

గురువారం రాత్రి 7 గంటల సమయంలో శ్రీకాకుళం దగ్గర ఉన్నామని వచ్చేస్తున్నామని తన అన్నయ్యకు భీమారావు ఫోన్‌ చేసి చెప్పాడు. మరలా రాత్రి 10 గంటల ప్రాంతంలో పలాసలో ఉన్నామని కొన్ని గంటల్లో ఇంటికి చేరిపోతామని ఫోన్‌ ద్వారా సమాచారం అందజేశారు. అయితే రాత్రి 12 గంటల ప్రాంతంలో పాలవలస సమీపంలో జాతీయ రహదారిపై కొర్లాం నుంచి పర్లాకిమిడి రాంగ్‌ రూట్‌లో వెళుతున్న సిమెంట్‌ లారీ వీరిని ఢీకొట్టింది.

దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వారి వద్ద ఉన్న ఫోన్‌ కాల్స్‌ బట్టి పోలీసులు ఇస్కలపాలెంలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వీరు మృతి చెందిన విషయం శుక్రవారం ఉదయానికి దావనంలా వ్యాపించింది. ఇద్దరు యువకుల మృతితో చిన కర్రివానిపాలెం, ఇస్కలపాలెం గ్రామాల్లో, అండమాన్‌లో వీరుంటున్న ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దగ్గర బంధువులైన ఈ రెండు కుటుంబాల ఆశల దీపాలు ఆవిరైపోవడంతో ఆ కుటుంబాల రోదన వర్ణనాతీతం. సోంపేట సామాజిక ఆస్పత్రిలో మృతదేహాలకు శవపంచనామా నిర్వహించారు. బారువ ఎస్‌ఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డున పడిన కుటుంబం

కవిటి మండలం చిన్న కర్రివానిపాలెంనకు చెందిన సుందరరావు, హేమలమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కర్రి రామారావు కాగా, కుమార్తెను మృతుడు భీమారావు అన్నయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అయితే కర్రి రామారావుకు నాలుగేళ్ల క్రితం జ్యోతితో వివాహం చేశారు. వీరికి సంతానం లేదు. రామారావు వేటనే జీవన భృతిగా ఎంచుకుని తల్లిదండ్రులు, భార్యను పోషిస్తున్నాడు.  భర్త మృతితో జ్యోతి రోదన చూసేవారికి కన్నీళ్లు తెప్పించింది. రామారావు మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది.

పెళ్లి సంబంధాలు వెతుకుతుండగా..

సోంపేట మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి గోపాలరావు, సుమిత్ర దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు భీమారావు. ఇతడికి వివాహం చేసేందుకు సంబంధాలు వెతుకుతున్నారు. పండగ చేసుకోవడానికి స్వంత గ్రామానికి వచ్చిన కుటుంబం భీమారావు మృతితో తీవ్ర విషాదంలోకి వెళ్లింది.  

Advertisement
Advertisement