గోదావరిలో దూకి ఇద్దరు యువకులు గల్లంతు | Sakshi
Sakshi News home page

గోదావరిలో దూకి ఇద్దరు యువకులు గల్లంతు

Published Mon, Jul 6 2020 12:18 PM

Two Youngmen Missing in Godavari Kovvuru - Sakshi

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనారోగ్యంతో ఒకరు, రుణభారంతో మరొకరు గోదావరిలో దూకి గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా చీకటి పడటంతో నిలిపివేశారు.

కొవ్వూరు రూరల్‌: కొవ్వూరు రోడ్‌ కం రైల్వే వంతెనపై నుంచి ఆదివారం ఓ యువకుడు గోదావరి నదిలోకి దూకాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన ఉక్కుజూరి రాజేశ్వరరావు(30) వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకాడు. రాజేశ్వరరావు హైదరాబాద్‌లో కెమెరా అసిస్టెంటుగా పనిచేస్తుంటారు. కాలికి దెబ్బ తగలడంతో విశ్రాంతి కోసం ఇరవై రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామమైన నందమూరు వచ్చాడు. ఆదివారం తన స్కూటీ వేసుకుని బ్రిడ్జిపైకి వెళ్లి బండిని వదిలి గోదావరిలో దూకాడు. అతని కోసం పట్టణ ఎస్సై కె.వెంకటరమణ ఆధ్వర్యంలో నదిలో సాయంత్రం వరకు గాలించారు. చీకటి పడటం, వర్షం కురవడం కారణంగా గాలింపు నిలిపివేశామని సోమవారం మళ్లీ గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు.

చించినాడ వద్ద వేడంగి యువకుడు...
యలమంచిలి:  పోడూరు మండలం వేడంగి గ్రామానికి చెందిన శిరిగినీడి ఆంజనేయులు ఆలియాస్‌ అంజి (25) చించినాడ వద్ద వంతెనపై నుంచి ఆదివారం వశిష్ట గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. ఆ సమయంలో అటువైపుగా వస్తున్న వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ కొప్పిశెట్టి గంగాధరరావు ఆధ్వర్యంలో పోలీసులు, జాలర్లు యువకుని కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. వంతెనపై యువకుడు వేసుకువచ్చిన ఏపీ07ఎం 1575 బైక్, జోళ్లు, సెల్‌ అక్కడే ఉన్నాయి. పోలీసులు ఆ సెల్‌ నుంచి ఫోన్‌ చేసి యువకుని వివరాలు తెలుసుకున్నారు. ఆ యువకునికి వేడంగి సెంటర్‌లో పాదరక్షల దుకాణం ఉందని, ఆర్థికంగా దెబ్బతిని రుణగ్రస్తుడు కావడం వలన గోదావరిలోనికి దూకి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. గల్లంతైన యువకుని ఆచూకీ రాత్రి వరకు లభించకపోవడం, మరో వైపు వర్షం కురుస్తున్నందున గాలింపు ఆపివేశారు. సోమవారం ఉదయం గాలింపు ప్రారంభిస్తామని ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement