అంతా పథకం ప్రకారమే.! | Sakshi
Sakshi News home page

అంతా పథకం ప్రకారమే.!

Published Fri, Jun 15 2018 1:31 PM

Umra Tour Cheaters Arrest In YSR Kadapa - Sakshi

కడప అర్బన్‌ : తక్కువ మొత్తానికే ఉమ్రా యాత్రకు వెళ్లే అవకాశం కల్పిస్తామంటూ నమ్మ బలికి వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగాళ్లను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. 

సాధారణంగా ఒక్కొక్కరు ఉమ్రా యాత్రకు వెళ్లాలంటే రూ. 75 వేల నుంచి రూ. 80 వేలు ఖర్చవుతుంది. కానీ పేద ముస్లింల వద్ద నుంచి ఉమ్రా యాత్ర కోసం రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు తీసుకున్నారు. వీటిని విమాన, విజా ఖర్చుల కోసమని చెప్పారు. మిగిలిన డబ్బులను విదేశాల్లో ఉన్న దాతల సహాయంతో ఉమ్రా యాత్రకు వెళ్లిన వారికి ఉన్నతమైన సౌకర్యాలను కల్పించారు. ఈ యాత్ర జిల్లాలోని, ఇతర రాష్ట్రాల్లోని పేద ముస్లింలను మూడుసార్లు ప్యాకేజీ ద్వారా పంపించారు. తర్వాత దాతలు లేకపోవడం, దాతలతో మధ్యవర్తిత్వం చేయించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్లిం మత గురువు ఇమామ్‌ తేజబుల్‌ హసన్‌ చనిపోయాడు.

దీంతో ముందుగా రిజిష్టర్‌ చేయించుకున్న వారిని, వెనుక రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి డబ్బులతో సర్దుబాటు చేస్తూ ఉమ్రా యాత్ర విజయవంతమవుతున్నట్లు ప్రజలను మోసగించారు.  కడప అల్మాస్‌పేటలో కార్వాన్‌ సయ్యద్‌ సాజీద్దీన్‌ టూర్‌ అండ్‌ ట్రావెల్స్‌ (ఉమ్రా అండ్‌ జియారత్‌ ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థను రిజిష్టర్‌ చేయించుకున్న సయ్యద్‌ అల్తాఫ్‌ హుసేన్‌కు ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌  మహమ్మద్‌ అలీ డబ్బును అప్పుగా ఇచ్చి ప్రతిఫలంగా తన ఎంఐఎం పార్టీ కార్యకర్తలను ప్రొద్దుటూరు, రాజంపేటలలో ఏజెంట్లుగా పెట్టేందుకు అల్తాఫ్‌ హుసేన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. యాత్రికుల నుంచి వసూలు చేసిన డబ్బులను తమ సొంత అవసరాలకు వినియోగించుకుని స్థిరాస్థులను కూడబెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిలో మూడవ నిందితుడు, రాయచోటికి  చెందిన బర్కత్‌ ఆలీ కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ కార్యాలయంలో లావాదేవీలు చూసుకుంటూ తమ యజమానికివంతు సహకారం అందించారు.

బాధితులు ఆరు వేలకు పైగా...రూ. 15–20 కోట్లు వసూలు
 జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలతోపాటు జమ్ము కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 18 రాష్ట్రాలకు చెందిన ప్రజలను తమ ఉమ్రా ప్యాకేజీ ద్వారా కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ వారు విశేషంగా ఆకర్షించారు. తాము తక్కువ మొత్తానికి ఉమ్రా యాత్ర చేయిస్తామంటూ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. దీంతో ఆకర్శితులైన బాధితులు వేలాది మంది డబ్బులను కూడా అదే స్థాయిలో ఆయా బ్రాంచ్‌లలో కట్టారు. ముంబయిలో కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ వారు మరో కార్యాలయాన్ని ప్రారంభించి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఆకట్టుకున్నారు. ఇలా వీరందరి నుంచి 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తంతో పారిపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబయి కార్యాలయంలో ప్రస్తుతం కేఎస్‌ఎస్‌ ట్రావెల్స్‌ పరిధిలో దాదాపు నాలుగు వేల మంది బాధితులకు సంబంధించిన పాస్‌పోర్టులు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని అరెస్టు చేసిన కడప సీసీఎస్‌ పోలీసులు 50 మంది బాధితులకు సంబంధించిన పాస్‌పోర్టులను మాత్రమే సీజ్‌ చేశారు.

ఈ కేసులో జిల్లాలోని ఏజెంట్లతోపాటు 18 రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్లను కూడా నిందితులుగా పోలీసులు చేర్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బాధితుల పాస్‌పోర్టులను కోర్టు అనుమతితో వారికి అందజేసే ప్రయత్నం చేస్తామని లేదా బాధితులే కోర్టును ఆశ్రయించి పొందేలా చూస్తామని సీసీఎస్‌ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బు నుంచి నిందితులు కూడబెట్టన స్థిరాస్థుల అటాచ్‌మెంట్‌కు కూడా తమవంతు దర్యాప్తులో భాగంగా చేపడతామన్నారు.వీరిపై జిల్లాలోని పలు స్టేషన్లతోపాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement