పెళ్లింట‘అకాల’ విషాదం | Sakshi
Sakshi News home page

పెళ్లింట‘అకాల’ విషాదం

Published Tue, Apr 10 2018 1:14 PM

Uncle And Son In Law Died In Short Circuit - Sakshi

మరో మూడురోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగేవి.. ఇప్పటికే ఆడపడుచుల కుటుంబ సభ్యుల రాక.. దగ్గరి బంధువుల కోలాహలం.. వివాహ మహోత్సవానికి చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు.. పిల్లల కేరింతలు ఇలా ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉంది. ఇంతలోనే విధి ఆ కుటుంబంపై కన్నెర్రజేసింది.. మృత్యువు విద్యుత్‌ రూపంలో మామాఅల్లుడిని కబళించగా.. మరో నలుగురిని గాయాలపాల్జేసి.. పెళ్లింట పెను విషాదాన్ని నింపింది.

అర్వపల్లి (తుంగతుర్తి) : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి  బాసపోలు సత్యనారాయణ(54), పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు ఇప్పటికే చేశారు. కాగా కుమారుడు ఉపేందర్‌ వివా హం ఈనెల 12న నిశ్చయమైంది. పెళ్లి పత్రికలు కొట్టించి పంచారు. పెళ్లికి కావాల్సిన సరుకులు తెచ్చిపెట్టుకున్నారు. ఈనెల 11న ఉపేందర్‌ను పెళ్లి కుమారుడి చేసి 12న వివాహం జరగనుంది. జనగామ  జిల్లా దేవరప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మౌనికతో వివాహం కుదిరింది. అయితే ఈ  వివాహం వధువు  ఇంట్లో  జరగనుండగా వరుడి ఇంట్లో  పెళ్లి కుమారుడిని చేయడానికి ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆదివారం రాత్రే  ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు పెళ్లి వేడుకలకు కొమ్మాలకు వచ్చారు.

పెళ్లి వేడుకతో కళకళలాడాల్సి ఉండగా..
పెళ్లి వేడుకలతో ఆ ఇల్లు కళకళలాడాల్సి ఉండగా ఒక్కసారిగా  జరిగిన అనుకోని ప్రమాదంతో విషాదం అలుముకుంది. పెళ్లికి ముందే వచ్చిన బంధువులంతా దు:ఖ సాగరంలో మునిగిపోయారు  ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టించింది.

ఇద్దరు అల్లుళ్లది జనగామ జిల్లానే..
సత్యనారాయణ పెద్ద కుమార్తె ఉమను జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన గవాని శోభన్‌బాబుతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు చరణ్‌తేజ ఉన్నారు. రెండో కుతురు నవనీతను ఇదే జిల్లా పాలకుర్తి మండలం  తిరుమలగిరికి  చెందిన సురపు వెంకటష్‌తో వివాహం  చేశారు. వీరికి ఇద్దరు సంతానం.

కొమ్మాలలో విషాదఛాయలు
సత్యనారాయణ ఇంట్లో మారో రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లికి ముందు అనుకోని ఘటనతో  మామ, అల్లుళ్లు ఒకేసారి మరణించడం, కుటుంబ సభ్యులు నలుగురు గాయడటంతో గ్రామంలో  విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చూసిన గ్రామస్తులు బోరున విలపించారు.

ఎక్కడి మృతదేహాలు అక్కడికే..
విద్యుదాఘాతంతో మరణించిన బాసపోలు సత్యనారాయణ, ఆయన అల్లుడు శోభన్‌బాబుల మృతదేహాలకు తుంగతుర్తి ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. అనంతరం మామ మృతదేహాన్ని కొమ్మాలకు, అల్లుడి మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జనగామ జిల్లా రామవరం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకున్నారు. అయితే వేర్వేరుగా జిల్లాల్లో అంత్యక్రియలు జరగడంతో బంధువులు ఎటు వెళ్లాలి.. ఎవరి అంత్యక్రియల్లో పాల్గొనాలో అర్థంకాక దు:ఖసాగరంలో మునిగారు. పెద్ద కూతురు పద్మ ఇటు భర్త చనిపోవడంతో  ఇది జీర్ణించుకోలేక అటు తండ్రి అంత్యక్రియకు వెళ్లలేక దేవుడా నాపై ఇంత కక్ష ఎందుకు అంటూ బోరున విలపించడం పలువురిని కంటతడిపెట్టించింది. కాగా ఉపేందర్‌కు పిల్లనిచ్చే అత్తింటి వారు కూడా నాబిడ్డ జీవితం ఇలా అయిపోందని విలపించారు.  ఎస్సై మోహన్‌రెడ్డి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరండా రేకులు సరిచేస్తుండగా..
వారం రోజుల కిందట వచ్చిన ఈదురుగాలు లు, అకాల వర్షానికి సత్యనారాయణ ఇంటి వరండా రేకులు చెల్లాచెదురయ్యాయి. కాగా వాటిని సోమవారం అల్లుళ్లతో కలిసి సత్యనారాయణ సరిచేస్తున్నాడు. ఈదురుగాలులకు మళ్లీ రేకులు లేవకుండా జేవైరును సత్యనారాయణ, ఆయన పెద్దల్లుడు గవాని శోభన్‌బాబు (32) గట్టిగా గుంజి కడుతున్నారు. అయితే జేవైరు కిందనే ఉన్న కరెంటు సర్వీసు వైరు రేకుకు తగిలి తెగింది. ఈక్రమంలో జేవైరుకు కరెంటు సరఫరా అయి విద్యాదాఘాతంతో సత్యనారాయణ, శోభన్‌బాబు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే వీరిని కాపాడబోయిన సత్యనారాయణ భార్య పద్మ, చిన్నల్లుడు సురపు వెంకటేష్, పెళ్లి కుమారుడు ఉపేందర్‌ వారి బంధువు అయిన బాసపోలు విజయ్‌ గాయపడ్డారు. వీరు  కరెంటు షాక్‌తో కేకలు వేస్తుండగా  గ్రామానికి చెందిన మందడి పిచ్చిరెడ్డి వచ్చి సర్వీసు వైరును గుంజి  పక్కకు వేసి నలుగురి ప్రాణాలు కాడారు. ఈ ప్రమాదంలో మరణిం చిన పెద్దల్లుడు శోభన్‌బాబుది జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామం. ఈయన ఇదే జిల్లాలోని  దేవరుప్పలలో ప్రైవేట్‌ పాఠశాల స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గాయపడిన చిన్నల్లుడు సురపు వెంకన్నది ఇదే జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి స్వగ్రామం.

మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున సాయం  
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున విద్యుత్‌ పంపిణీ సంస్థ నుంచి సాయం అందించనున్నట్లు తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ గాదరి కిశోర్‌కుమార్‌ చెప్పారు. సోమవారం సంఘటనాస్థలిని సందర్శించి సత్యనారాయణ, శోభన్‌బాబుల మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పెళ్లింటో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడి సాయం త్వరగా అందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్, సర్పంచ్‌ కుంట్ల సురేందర్‌రెడ్డి, మాదం వీరారెడ్డి, కె.సైదులు, శిగ రంజిత్, బి.ప్రవీణ్,గడ్డం వెంకన్న, ధర్మాజి, చిర్రబోయిన వెంకన్న,ఎస్‌.శ్రీనివాస్, లక్ష్మణ్, నాగులు, కేఎస్‌రెడ్డి, అర్జున్‌ ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement