ట్రాక్టర్‌ ఢీకొని కారేగాం వీఆర్‌ఏ మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని కారేగాం వీఆర్‌ఏ మృతి

Published Fri, Jan 5 2018 1:06 AM

vra died in tractor accedent - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/పిట్లం (జుక్కల్‌): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం గ్రామ వీఆర్‌ఏ బోయిని సాయిలు (36) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అదే గ్రామానికి చెందిన బ్యాగరి అంబయ్య ట్రాక్టర్‌తో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అయితే సాయిలును ఇసుక మాఫియానే హత్య చేసిందని, అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు, కారేగాం, మార్ధండ గ్రామస్తులు ఆరోపించారు.

సాయిలు మృతి విషయం తెలిసి వారంతా గురువారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలుసుకున్న వీఆర్‌ఏ సాయిలు.. అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని, దాంతో హత్య చేశారన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించబోమంటూ రోడ్డుపై బైఠాయించారు.

ఘటనకు కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంబయ్యపై దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. సాయిలు భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే సాయిలు ప్రమాదవశాత్తు మృతి చెందారని, అది హత్య కాదని ప్రాథమిక విచారణలో తేలిందని బాన్సువాడ రూరల్‌ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ అంబయ్య కారేగాం నుంచి ఇటుక లోడ్‌ తీసుకుని సంగారెడ్డి జిల్లా దామరగిద్దకు వెళ్లాడని చెప్పారు. తిరిగి వస్తుండగా గ్రామ శివార్లలో ప్రమాదం జరిగిందని, సాయిలుపై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని వెల్లడించారు.

Advertisement
Advertisement