క్షణికావేశం.. కుటుంబం చిన్నాభిన్నం | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. కుటుంబం చిన్నాభిన్నం

Published Mon, Nov 4 2019 1:04 PM

Wife And Sons Killed Husband in YSR Kadapa - Sakshi

వైఎస్‌ఆర్‌ జిల్లా,బద్వేలు అర్బన్‌ : భర్త మద్యానికి వ్యసనం.. భార్య క్షణికావేశం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మార్పు రాని భర్తతో ఇక వేగలేనని ఆ ఇల్లాలు కఠిన నిర్ణయం తీసుకుంది. ఆలనాపాలనా పట్టించుకోని కన్నతండ్రిని చివరకు కడతేర్చేందుకే ఆ కుమారులు నిర్ణయం తీసుకున్నారు. మద్యం మహమ్మారి, క్షణికావేశం చక్కని సంసారంలో చిచ్చు పెట్టింది. శనివారం రాత్రి పట్టణంలోని కొండారెడ్డివీధిలో చోటు చేసుకున్న ఘటనతో కుటుంబ యజమాని మృతిచెందగా భార్య, ఇద్దరు పిల్లలు కటకటాలపాలవబోతున్నారు. 

మద్యంకు బానిసై వేధింపులు
పట్టణంలోని అగ్రహారంకు చెందిన పందీటి ఆంజనేయులుకు 20 సంవత్సరాల క్రితం నాగలక్ష్మి అనే మహిళతో వివాహమైంది. వీరికి నాగరాజు, చంద్ర అనే కుమారులు ఉన్నారు. అయితే పెళ్లి అయిన కొన్నేళ్లకే ఆంజనేయులు మద్యానికి బానిసై కుటుంబ పోషణ పట్టించుకోకుండా వదిలేశాడు. దీంతో నాగలక్ష్మి ఇళ్లలో బట్టలు ఉతుకుతూ పిల్లలను చదివించుకుంది. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్‌ చదవగా చిన్న కుమారుడు పదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఆంజనేయులు వచ్చిన కూలి డబ్బుతో నిత్యం మద్యం సేవించి భార్యను, ఇద్దరు పిల్లలను వేధించేవాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి సంపాదన సరిపోకపోవడంతో పెద్ద కుమారుడు నాగరాజు చదువు మధ్యలో ఆపేసి ఓ మెడికల్‌షాపులో పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటూ తమ్ముడిని చదివించుకుంటుండేవాడు. అయినా తండ్రి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో అనేకసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. చివరకు రెండేళ్ల క్రితం బద్వేలుకు వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజులు బాగానే ఉన్న ఆంజనేయులు తిరిగి యథాప్రకారం మద్యం సేవించడం, ఘర్షణకు దిగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో శనివారం కూడా పూటుగా మద్యం సేవించి వచ్చిన ఆంజనేయులు భార్య, పిల్లలతో ఘర్షణకు దిగాడు. ఈ సమయంలో కోపోద్రిక్తురాలైన భార్య నాగలక్ష్మి ఇంట్లోని రోకలిబండ తీసుకుని భర్త తలపై, ముఖంపై దాడి చేసింది. ఇదే సమయంలో ఇద్దరు కుమారులు కూడా బండరాళ్లు తీసుకుని తండ్రి తలపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆంజనేయులును స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి కడపకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. 

క్షణికావేశంలో..
క్షణికావేశంలో చేసే దారుణాలు తమతో పాటు తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇదే కోవలో శనివారం కొండారెడ్డి వీధిలో క్షణికావేశంలో జరిగిన తప్పుకు ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. భర్తతో కలిసి జీవితాంతం ఉండాల్సిన ఆ భార్య భర్త పెట్టే వేధింపులు భరించలేక చివరకు అతడిని కడతేర్చింది. మరోవైపు తండ్రి ఆలనాపాలన దూరమైనప్పటికీ చక్కగా చదువుకుని ప్రయోజకులు కావాల్సిన కుమారులిద్దరు తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి సహకరించి చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. 20 ఏళ్లుగా భర్త పెట్టే చిత్రహింసలు ఎన్నో భరించా. ఇకనైనా మారుతాడేమోనని ఎదురుచూశా. అయినా మార్పు రాలేదు. ఇక భరించే ఓపిక లేకనే హతమార్చా అని ఆమె చెప్పే మాటలు ఒకింత ఆమె పట్ల సానుభూతి కలిగించినా .... కట్టుకున్న భర్తనే హత్య చేసే స్థాయికి దిగజారడం సరైంది కాదనే వాదన వినిపిస్తుంది. మొత్తం మీద మద్యం మహమ్మారి, క్షణికావేశం కారణంగా జరిగిన ఈ ఘటన వారి కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. 

Advertisement
Advertisement