బంగారు వ్యాపారికి మస్కాకొట్టిన కిలేడీ

27 Sep, 2019 13:36 IST|Sakshi
సీసీ పుటేజ్‌లో మహిళ

బంగారు నెక్లెస్‌ను తస్కరించిన మహిళ

సీసీ పుటేజ్‌ ఆధారంగా గుర్తింపు

పోలీసుల అదుపులో నిందితురాలు

నెల్లూరు(క్రైమ్‌): ఓ మహిళ బంగారు వ్యాపారిని మస్కా కొట్టి నెక్లెస్‌ తస్కరించి అక్కడ నుంచి జారుకుంది. సీసీ పుటేజ్‌ల ఆధారంగా కిలేడిని బాధిత వ్యాపారి గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తుండడంతో బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హడావుడిగా కేసు నమోదు చేశారు. వివరాలు.. నెల్లూరు నగరంలోని కాపువీధికి చెందిన లలిత్‌ బంగారు వ్యాపారి. ఆయన అదే ప్రాంతంలో ఫైనాన్స్‌ అండ్‌ పాన్‌బ్రోకర్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ మహిళ బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చింది. ఓ నెక్లెస్‌ను సెలక్ట్‌ చేసి తన కుమారుడు వచ్చి నగదు చెల్లిస్తాడని అక్కడే కూర్చొంది. దీంతో వ్యాపారి ఆ నెక్లెస్‌ను ప్యాక్‌ చేసి సిద్ధంగా ఉంచాడు. ఈ నేపథ్యంలో ఆ దుకాణానికి కొంతమంది వచ్చి బంగారు ఆ భరణాలు పరిశీలిస్తుండగా ఆమె కూడా ఆభరణాలు చూస్తున్నట్లు నటించి సుమారు రూ.1.59 లక్షల విలువ చేసే 53 గ్రాముల బంగారు నెక్లెస్‌ను కాజేసి దుస్తుల్లో దాచేసింది.

అనంతరం అక్కడి నుంచి చల్లగా జారుకుంది. దుకాణంలో కొనుగోలుదారులందరూ వెళ్లిపోయిన అనంతరం యజమాని లలిత్‌ ఆభరణాలు సరిచూసుకోగా 53 గ్రాముల బంగారు నెక్లెస్‌ కనిపించలేదు. దీంతో లలిత్‌ తన దుకాణంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా తొలుత వచ్చిన మహిళ బంగారు ఆభరణాన్ని తస్కరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆమె గురించి ఆరా తీయగా కుక్కలగుంటకు చెందిన మహిళ అని తేలింది. ఆమె తన స్నేహితుడి ద్వారా దానిని కరిగించి మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయంపై బాధితులు బుధవారమే సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కించినట్లు తెలిసింది. దీంతో బాధితులు గురువారం ఈ విషయాన్ని స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులకు తెలియజేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు సంతపేట పోలీసులతో మాట్లాడడంతో గురువారం రాత్రి çబాధితుల నుంచి మరోసారి లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకుని హæడావుడిగా కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు కిలేడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా