ఫేస్‌‘బుక్కైపోయింది’! | Sakshi
Sakshi News home page

ఫేస్‌‘బుక్కైపోయింది’!

Published Thu, Aug 9 2018 8:14 AM

Woman Complaint To Cyber Crime Cops In Fraud Case hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు... తిరుపతిలో ఉంటున్నానని చెప్పాడు... ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎర వేశాడు... ఏడాదిన్నర పాటు ఏమార్చి రూ.14.5 లక్షలు కాజేశాడు... మోసపోయినట్లు తెలుసుకుని వేడుకోగా రూ.64 వేలు తిరిగి చెల్లించాడు... మిగిలిన మొత్తం ఇవ్వమంటే చేతనైంది చేసుకోమన్నాడు... దీంతో బాధితురాలు బుధవారం సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌ తివారీ దర్యాప్తు ప్రారంభించారు.

పౌర సరఫరాల శాఖ పేరు చెప్పి...
బాగ్‌ అంబర్‌పేటకు చెందిన ఓ వివాహిత ఆధ్యాత్మిక సంస్థలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. ఈమెకు 2017లో ఫేస్‌బుక్‌ ద్వారా షేక్‌ ఇల్వాజ్‌ అహ్మద్‌గా చెప్పుకున్న వ్యక్తి పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు తాను తిరుపతిలో పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్నానని, తెలంగాణలోని సదరు విభాగంలో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసేందుకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఎర వేశాడు. ఆమె నమ్మడంతో తన ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పిన ఇల్వాజ్‌ అందుకు కొంత ఖర్చవుతుందని పేర్కొంటూ తిరుపతికి చెందిన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్లు, డిపాజిట్లు వద్దని చెప్పిన అతను కేవలం క్యాష్‌ డిపాజిట్‌ మెషిన్స్‌ (సీడీఎం) ద్వారానే చెల్లించాలని సూచించాడు. 

రూ.వేలు కోరుతూ.. లక్షలు స్వాహా...
 2017 మార్చిలో వివాహిత నుంచి డబ్బు గుంజడాన్ని ప్రారంభించిన ఇల్వాజ్‌ గత నెల 23 వరకు కొనసాగించాడు. ప్రతి సందర్భంలోనూ రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు సీడీఎం ద్వారా డిపాజిట్‌ చేయించుకుంటూ రూ.14.5 లక్షలు స్వాహా చేశాడు. భర్తకు తెలియకుండా తన వద్ద ఉన్న డబ్బుతో పాటు బంగారు ఆభరణాలు విక్రయించి, పరిచయస్తులు, స్నేహితుల వద్ద అప్పు చేసి ఈ మొత్తం చెల్లించింది. లావాదేవీలకు సంబంధించిన స్లిప్స్‌ ఆధారంగా అనుమానించిన కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో ఆమెతో పాటు కుటుంబీకులు ఇల్వాజ్‌ ఇచ్చిన నంబర్లను సంప్రదించారు. కొన్ని రోజులు వేడుకోగా రూ.63,800 తిరిగి చెల్లించాడు. ఆపై బెదిరింపులకు దిగడంతో పాటు డబ్బు ఇవ్వనని, చేతనైంది చేసుకోమంటూ హెచ్చరించాడు. దీంతో బాధితురాలు బుధవారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. 

పెళ్లి పేరుతో రూ.4.69 లక్షలు
కేవలం 24 గంటల వ్యవధిలో మరో మ్యాట్రిమోనియల్‌ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితురాలిని కలవడానికి వస్తున్నానంటూ చెప్పిన ‘విదేశీ పెళ్లి కొడుకు’ కస్టమ్స్‌ విభాగం పేరు చెప్పి, వివిధ పేర్లతో ఫోన్లు చేయించి రూ.4.69 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన ఓ యువతి నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పని చేస్తోంది. ఈమె తన ప్రొఫైల్‌ను రెండు నెలల క్రితం భారత్‌ మ్యాట్రిమోనీలో రిజిస్టర్‌ చేసుకున్నారు. జూన్‌ 17న ఈమెకు విజయ్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి ఫ్రొఫైల్‌ వచ్చింది. పెట్రోకెమికల్‌ ఇంజినీరైన తాను ప్రస్తుతం బేనిన్‌లో ఉన్న సౌత్‌ అట్లాంటిక్‌ పెట్రోలియం లిమిటెడ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అందులో పొందుపరిచాడు.

తన మెయిల్‌ ఐడీతో పాటు ఫోన్‌ నంబర్‌ కూడా పంపడంతో ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. తాను భారత్‌కు వస్తున్నట్లు జూలై 18న విజయ్‌కుమార్‌ సందేశం ఇచ్చాడు. ఆ మరుసటి రోజే ఖతర్‌ కస్టమ్స్‌ కార్యాలయం నుంచి అంటూ బాధితురాలికి ఫోన్‌ వచ్చింది. విజయ్‌కుమార్‌ మీకు తెలుసా అంటూ వారు అడగడంతో ఔనని సమాధానం చెప్పింది. ఆ తర్వాత పలు మార్లు ఫోన్లు చేసిన సైబర్‌ నేరగాళ్లు సాంకేతిక కారణాలతో విజయ్‌కుమార్‌ ప్రయాణాన్ని అంగీకరించమని, అతడు భారత్‌కు రాలేడని చెప్పారు. ఓ దశలో ఆమెతో మాట్లాడిన విజయ్‌కుమార్‌ వారు చెప్పిన మొత్తాలు చెల్లించాలని, తాను వచ్చాక తిరిగి ఇస్తానంటూ చెప్పాడు. ఇలా వివిధ దఫాలుగా ఆమె నుంచి రూ.4.69 లక్షలు కాజేయడంతో బాధితురాలు బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.  

నేరుగా చూడనిదే నమ్మవద్దు
ఉద్యోగం పేరు చెప్పినా, వివాహమంటూ ప్రతిపాదించినా నేరుగా చూడనిదే ఎవరినీ నమ్మవద్దు. ఇలాంటి మోసగాళ్లు ఏ దశలోనూ తమ నిజమైన పేర్లు, వివరాలు చెప్పరు. వీరు వినియోగించే సెల్‌ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా బోగస్‌వే. బాధితుల అమాయకత్వం, అత్యాశే వీరికి పెట్టుబడి. కేవలం ఫోన్‌కాల్స్, ఫేస్‌బుక్, మ్యాట్రిమోనియల్‌ ప్రొఫైల్స్‌ చూసి వివాహమంటూ ఆశలు పెట్టుకోవద్దు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో అడ్డదారిలో పొందటం  అసాధ్యం.ఇలాంటి మోసగాళ్ల వల్లో పడకుండా ఎర వే సిన వారి వివరాలు పోలీసులకు అందించాలి.– విజయ్‌ ప్రకాష్‌తివారీ, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌  

Advertisement
Advertisement