అనుమానాస్పదంగా వివాహిత మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా వివాహిత మృతి

Published Wed, Jan 23 2019 12:56 PM

Woman Suicide Commitment Dies In Nizamabad - Sakshi

బాన్సువాడ: మూడు రోజుల క్రితం కరెంట్‌ షాక్‌తో మృతిచెందిన ఓ వివాహితను హత్య చేశారంటూ బంధుమిత్రులు, తండావాసులు శవాన్ని ఏరియా ఆసుపత్రిలో ఉంచి, వివాహిత సోదరుడు వచ్చే వరకు పోస్టుమార్టం చేయకుండా ఆపేశారు. ఇండియన్‌ ఆర్మీలో ఉండే వివాహిత సోదరుడు మంగళవారం నాడు బాన్సువాడకు రాగా, వీడియోగ్రఫీ మధ్య శవాన్ని పోస్టుమార్టం చేశారు. బాన్సువాడ సీఐ మహేష్‌ గౌడ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్‌ మండలం సింగీతం జీపీ పరిధిలోని శనివార్‌పేట తండాకు చెందిన నెనావత్‌ గోపాల్‌కు 9 ఏళ్ళక్రితం గండివేట్‌ తండాకు చెందిన వినావత్‌ వినోద(29)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తరచుగా అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించేవారు.

అలాగే భూమి విషయంలోనూ తరచుగా గొడవలు జరిగేవి. అయితే వినోద భర్త హైదరాబాద్‌లో ఉండగా, ఆదివారం నాడు వినోదకు కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందినట్లు అత్తామామలు చుట్టుపక్కల వారికి తెలియజేశారు. పొలంలో వెళ్తుండగా, కరెంటు వైరు తగిలి మృతి చెందినట్లు చెప్పడంతో, తండావాసులకు అనుమానాలు వచ్చి ఆమె శవాన్ని పోస్టుమార్టం చేయకుండా నిలిపివేశారు. శవాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వినోద అన్నయ్య అయిన కిషన్‌ ఇండియన్‌ ఆర్మీలో పని చేస్తాడని, అతను వచ్చే వరకు శవానికి పోస్టుమార్టం చేయవద్దంటూ డిమాండ్‌ చేశారు. దీంతో ఆది, సోమ, మంగళవారాల్లో శవాన్ని పోస్టుమార్టం గదిలో డీఫ్రిజ్‌లో శవాన్ని భద్రపర్చారు.

కిషన్‌ బాన్సువాడకు రాగా, సీఐ మహేష్‌గౌడ్‌ సమక్షంలో వీడియోగ్రఫీ మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. తన చెల్లెలు కరెంటు షాక్‌తో మృతి చెందలేదని, భర్త, అత్తామామలే చంపేశారని, కరెంటు షాక్‌తో మృతి చెందినట్లు చెబుతున్నారని కిషన్‌ విలేకరులతో ఆరోపించారు. తనకు స్థానిక పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదని, శవానికి సరిగా పోస్టుమార్టం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ, తండావాసులను సముదాయించి పోస్టుమార్టం నిర్వహించారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, దోషులెవరైనా పట్టుకొట్టామని సీఐ మహేష్‌గౌడ్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement