అడవిలో ప్రేమజంట బలవన్మరణం

12 Sep, 2019 09:28 IST|Sakshi

చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య

సాక్షి, కొందుర్గు: ఓ ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల అడవిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కుల్కచర్ల మండలం పుట్టపహడ్‌ గ్రామానికి చెందిన వెంకటయ్య, రాములమ్మ దంపతుల చిన్నకూతురు కృష్ణవేణిని(17) తన పెద్దమ్మ అయిన జిల్లేడ్‌చౌదరిగూడ మండలంలోని రావిర్యాల గ్రామానికి చెందిన పద్మమ్మ దత్తత తీసుకొని పెంచుకుంటోంది. బాలిక 10వ తరగతి వరకు చదువుకొని ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటోంది. రావిర్యాల గ్రామానికి చెందిన మల్లేష్‌(21) హైదరాబాద్‌లో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వస్తుండేవాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది.

మల్లేష్‌, కృష్ణవేణి మృతదేహం  

అయితే, మంగళవారం ఉదయం వీరిద్దరూ ఇంట్లోంచి బయలుదేరారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కృష్ణవేణి పెద్దమ్మ బాలిక కోసం గాలించినా, వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె బుధవారం చౌదరిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం సాయంత్రం పెద్దఎల్కిచర్ల అడవిలో గొర్రెల కాపరి వెంకటయ్యకు చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. గ్రామస్తులు సమాచారంతో ఎస్సై సహీద్, ఏఎస్సై సత్యనారాయణగౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను కిందికి దించారు. బాలిక అదృశ్యం కేసు నమోదు కావడంతో కృష్ణవేణి పెద్దమ్మ పద్మమ్మకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు, బంధువులు గుండెలుబాదుకుంటూ రోదించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సహీద్‌ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా