యువతి చున్నీతో ఉరివేసుకున్న యువకుడు

6 Apr, 2019 09:39 IST|Sakshi

యువతికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడంతో మనస్తాపం

పెళ్లి రద్దు చేసుకోమని యువతిపై తీవ్ర ఒత్తిడి

అంగీకరించకపోవడంతో ఆత్మహత్య

విజయనగరం జిల్లా  చీపురుపల్లిలో ఘటన

చీపురుపల్లి: తను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడం, దాన్ని రద్దు చేసుకోమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె అంగీకరించకుండా తనను మరచిపోవాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆ యువతి చున్నీతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెరకముడిదాం మండలం భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్‌ (17), అదే మండలంలోని శ్యామాయవలస గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్‌ కోచింగ్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలల క్రితం వారికి పరిచయం ఏర్పడింది.

దాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్‌ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్‌ ఏడాది చిన్నవాడు కావడంతో ఆమె అంగీకరించలేదు. అయినప్పటికీ వెంట పడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరాడు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్‌ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది. శుక్రవారం చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్‌ ఆ యువతిని పిలిచాడు. ఆమె వెళ్లేసరికి ప్రవీణ్‌ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్‌ తాను వచ్చానని రమ్మని ఫోన్‌చేసి పిలిచాడు. ఆమె వెళ్లగా పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు. ఆమె ససేమిరా అంటూ నచ్చజెప్పింది.

మనస్తాపం చెందిన ఆ యువకుడు కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. చాలా సేపటి తరువాత ఫోన్‌ చేసి ‘ఇదే ఆఖరి మాట గుడ్‌బై’ అని ఫోన్‌ పెట్టేశాడు. ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు