Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Published Wed, Oct 24 2018 10:50 AM

Young Mens Died In Bike Accident Renigunta Chittoor - Sakshi

చిత్తూరు, రేణిగుంట: తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి రేణిగుంట మండలం గుత్తివారిపల్లె సమీపంలోని రాళ్లకాలు వ వంతెనపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో   ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మర ణం చెందారు. రేణిగుంట ఎస్‌ఐ మోహన్‌నాయక్‌ కథ నం మేరకు... పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు కు చెందిన ఎన్‌. నాగేశ్వరరావు కుమారుడు తేజేశ్వరరావు(24), ప్రసాద్‌  కుమారుడు సాయిచరణ్‌(24), వా రి స్నేహితులు దిలీప్‌కుమార్‌(24), మదన్‌కుమార్‌(24), సుకేష్‌రెడ్డి(24), నాగార్జున(24) స్నేహితులు. వీరంతా ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. వీరు ఆరుగురు మూడు ద్విచక్ర వాహనాలలో స్వగ్రామం కోవూరు నుంచి శ్రీవారి దర్శనార్థం ఆదివారం బయలుదేరి తిరుమలకు చేరుకున్నారు. సోమవారం వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనానంతరం మంగళవారం తిరుగు ప్రయాణంలో తేజేశ్వరరావు, సాయి చరణ్‌ ఒక బైక్‌పై, దిలీప్‌కుమార్, మదన్‌కుమార్‌ మరో బైక్‌పై, సుకేష్‌రెడ్డి, నాగార్జునలు మరో బైక్‌పై ఇంటికి బయల్దేరారు. వీరంతా మూడు బైక్‌లలో ముందు, వెనుక వెళుతుండగా రేణిగుంట దాటాక రాళ్లకాల్వ వంతెనపై తేజేశ్వరరావు, సాయిచరణ్‌ వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి లారీ బలంగా ఢీకొంది. దీంతో ఇద్దరు బైక్‌ నుంచి కిందపడ్డారు. లారీ వీరిపై ఎక్కి దిగడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఐ మోహన్‌నాయక్‌ అక్కడకు చేరుకుని, పరిశీలించి, మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు.  మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్‌వీ మెడికల్‌ కళాశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

రక్తమోడుతున్న రహదారులు
‘తిరుపతి–శ్రీకాళహస్తి రహదారి... కనీసం ముందు వెళుతు న్న వాహనాన్ని కూడా అధిగమించలేని పరిస్థితి. ఏ మాత్రం ఏమరుపాటుగా వాహనం నడిపితే రక్త తర్పణం తప్పదు. గుత్తివారిపల్లె సమీపంలోని రాళ్లకాలువ వంతెనపై   జరిగిన దుర్ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఇటు వాహనచోదకులు, అటు అధి కార గణం వాటి నివారణకు పాఠాలు నేర్వడం లేదు.’

170 కి.మీ. బైక్‌ ప్రయాణం శ్రేయస్కరమా?
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి తిరుమలకు 170 కిలోమీటర్ల దూరం. అంత దూరం మోటారుసైకిల్‌పై ప్రయాణం శ్రేయస్కరమా? అనే ప్రశ్న కుర్రాళ్లకు ఉత్పన్నం కాకపోవచ్చు. అయితే వారి తల్లిదండ్రులు బైక్‌ ప్రయాణం శ్రేయస్కరం కాదని ముందే పసిగట్టి ఉంటే మృత్యువు తప్పేదేమోనని పలు వురు అంటున్నారు.

Advertisement
Advertisement