Sakshi News home page

ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు

Published Tue, Feb 20 2018 11:23 AM

young woman complaint on harrassments - Sakshi

గుంటూరు: ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు కూడా మొదట్లో భయపడ్డాను. అతని ఆగడాలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పాను. ఈవిషయం తెలిసి పెళ్లికి అంగీకరించకపోతే నన్ను హతమారుస్తానని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాను. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఓ విద్యార్థిని రూరల్‌ అదనపు ఎస్పీ వరదరాజు వద్ద సోమవారం కన్నీటి పర్యంతమైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన చదలవాడ శ్రీకాంత్‌ గుంటూరు రూరల్‌ మండలం గ్రామంలోని ఓప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

అదే కళాశాలలో బీఫార్మాసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ గతేడాది సెప్టెంబరు నుంచి వెంటపడుతున్నాడు. ఫోన్‌ తీసుకొచ్చి ఆమెకు బలవంతంగా ఇచ్చి ఫోన్‌ నీ దగ్గర లేకుంటే అంతు చూస్తానని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె ఫోన్‌ ఇంటికి తీసుకువెళ్లింది. తల్లిదండ్రులకు విషయం చెబితే చులకనగా చూడడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలుపగా, శ్రీకాంత్‌ తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. అయినా శ్రీకాంత్‌ వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో గతనెల 10న తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో భయంగా కళాశాలకు వెళ్లాల్సి వస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. 

Advertisement
Advertisement