ఆమెకది విషమ ‘పరీక్ష’ | Sakshi
Sakshi News home page

ఆమెకది విషమ ‘పరీక్ష’

Published Sat, Jun 1 2019 9:56 AM

Young Woman Killed In Road Accident In Khammam - Sakshi

ఖమ్మంఅర్బన్‌ : ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. ప్రోత్సహించిన అమ్మానాన్నలకు అండగా ఉండాలనుకున్న ఆమెను ఓ లారీ మృత్యుశకటమై బలి తీసుకుంది. ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ముస్తఫానగర్‌కు చెందిన వంకాయల తబిత(20) అనే విద్యార్థిని నగరంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై శుక్రవారం లారీ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తబిత మార్వెల్‌ డిగ్రీ కాలేజీలో బీఏ కంప్యూటర్స్‌ కోర్సు పూర్తిచేసింది. శుక్రవారం కొణిజర్ల మండలంలోని తనికెళ్ల వద్ద ఉన్న లక్ష్య కళాశాలలో బీఈడీ ప్రవేశ పరీక్ష రాసేంసేందుకు బాబాయి రాజేందర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది.

ఎగ్జామ్‌ ముగిసిన తర్వాత అదే బండిపై ఇంటికి వస్తున్న క్రమంలో 15 నిమిషాల్లో ఇంటికి చేరతారనగా..ఎస్‌ఆర్‌గార్డెన్స్‌ సమీపంలోని పెట్రోల్‌బంక్‌ ఎదుట వెనక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. బండి అదుపుతప్పి..తబిత రోడ్డుపై పడిపోవడంతో లారీ టైర్‌ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో బైక్‌ పైనుంచి ఆమె బాబాయి రోడ్డుకు కాస్త పక్కగా పడగా కాళ్లు, చేతులకు తీవ్రగాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల పూర్తిగా నుజ్జునుజ్జవడంతో స్థానికులు పక్కకు తొలగించేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసుల సమాచారంతో అన్నం ఫౌండేషన్‌ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు, సభ్యులు వంశీ, ఉపేందర్‌ ఘటనాప్రాంతానికి వచ్చి తబిత మృతదేహాన్ని అంబులెన్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో బిడ్డా..
తబిత తండ్రి తిరుమలరావు డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తల్లి జయ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. సోదరుడు వేణు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ఎంతో కష్టపడి పిల్లలను బాగా చదివించారు. కూతురు ఉపాధ్యాయురాలవుతుందని, ఉద్యోగం సాధించి తన కాళ్లపై తాను నిలబడుతుందని ఆశలు పెట్టుకున్నారు. హఠాత్తుగా తబిత మృతి వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ‘అయ్యో బిడ్డా..మమ్మల్ని వదిలేసి పోయినవా..’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement