ఇంత వరకూ తెలియని సినారె | Sakshi
Sakshi News home page

ఇంత వరకూ తెలియని సినారె

Published Tue, Aug 2 2016 9:33 AM

ఇంత వరకూ తెలియని సినారె

వాషింగ్టన్ : తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు ఆచార్య సి.నారాయణరెడ్డి (సినారె). ప్రముఖ కవిగా, సినీ గీత రచయితగా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగానే కాక కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను సి.నారాయణరెడ్డి అందుకున్నారు. ఆయన జన్మదినం జులై 29వ తేదీ. ఈ సందర్భంగా సినారెతో తన 50 ఏళ్ల అనుబంధాన్ని మానవతావాది ఆచార్య నరిశెట్టి ఇన్నయ్య తన మనస్సులో నిక్షిప్తమైన జ్ఞాపకాల దొంతరలను ఇలా పంచుకున్నారు..

1967 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సినారె తెలుగు శాఖలో పని చేస్తుంటే... తాను తత్వశాస్త్ర (ఫిలాసఫీ) శాఖలో ఆచార్యులుగా విధులు నిర్వహించేవాళ్లమని ఇన్నయ్య గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ప్రతి రోజు తాము కలుసుకునే వాళ్లమని చెప్పారు. ఈ సందర్భంగా ఓ రోజు ఎం.ఎన్ రాయ్ రాసిన 'మారుతున్న భారతదేశం' పుస్తకం తెలుగులోకి అనువదించాను.

దీనిని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో సినారె ఎడిటర్గా ఉన్నారన్నారు. తన పుస్తకం చూసి...  జనానికి అర్థమయ్యేలా అనువదించమని సినారె సూచించారని తెలిపారు. అలా నిష్కర్షగా చెప్పడం మా స్నేహానికి నిదర్శనమన్నారు. అంతే కాకుండా ఆయనలోని ఓ ముఖ్య లక్షణం కూడా అని ఇన్నయ్య పేర్కొన్నారు. అలాగే ఎమ్.ఎన్.రాయ్ రచించిన మరో గ్రంథాన్ని వివేచన -ఉద్వేగం - విప్లవం పేరుతో తెనుగులోకి అనువదించానని చెప్పారు.

ఈ గ్రంథాన్ని సినారె తన ఉపన్యాసంలో చాలా విపులంగా సమీక్షించారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాత్రికేయుడు వి.సతీష్... సినారె ఉపన్యాసంపై స్పందించి.. నాలుగు పెగ్గులు సేవించినట్లుందని చమత్కరించారని ఇన్నయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్న సమయంలో ఓ సంఘటన చోటు చేసుకుందని ఇన్నయ్య నెమరేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో జోతిష్యం బోధనాంశంగా ఉండటాన్ని మానవవాద సంఘాలు అభ్యంతరం చెప్పాయి... దీనిపై శాస్త్రీయ పరిశీలన జరపాలని సదరు సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై సినారె స్పందించి... వైజ్ఞానికంగా జ్యోతిష్యం నిలబడుతోందా ? అనే అంశం పరిశీలించాలని.. అలాగే ఖగోళ శాస్త్రంతో పోల్చి చూడాలని ఆదేశించారు.

అయితే ఈ విషయంపై గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు రామన్...సినారెపై కత్తులు నూరారు.  ఆయన్ని వీసీ పదవి నుంచి తొలగించాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు రామన్ లేఖలు కూడా రాశారు. ఈ లోపు సినారె అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వీసీగా వెళ్లిపోయారన్నారు.

హైదరాబాద్ అశోక్నగర్లోని సినారె ఇంట్లో కొంత కాలం మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆచార్య ఎన్ జి రంగా కొంత కాలం అద్దెకు ఉండేవారని తెలిపారు. అలానే 1948లో ఆలపాటి రవీంద్రనాథ్ సంపాదకత్వంలో వెలువడిన జ్యోతి పత్రికకు సినారె అనేక రచనలు చేశారు. ఈ సందర్భంగా తాను, సినారె, రవీంద్రనాథ్ ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేయడం అనవాయితీగా మరిందన్నారు.

మరో మిత్రుడు, పాత్రికేయుడు డి ఆంజనేయులు తెలుగు కవులు, రచయితలను ఇతర రాష్ట్రాల వారికి తెలియజేస్తు అనేక సాహిత్య వ్యాసాలు రాసేవారు అలా రాసిన వాటిలో సినారెపై చాలా చక్కటి వ్యాసం రాశారన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు భాష ప్రచారం కోసం కరీంనగర్ నుంచి శ్రీకాకుళంలోని కథానిలయం వరకు సాహిత్య యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో సినారెతోపాటు తాను పాల్గొన్నాని ఇన్నయ్య చెప్పారు. ఆ క్రమంలో విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఇద్దరం ప్రసంగించామని ఇన్నయ్య వెల్లడించారు. 

అలానే ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి సూర్యదేవర సంజీవదేవ్ హైదరాబాద్ విచ్చేసేవారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో సినారెను ఆహ్వానించగా... వచ్చి ప్రసంగించేవారని చెప్పారు. సినారెతో తన అనుబంధం గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉందన్నారు.  సినారెకు ప్రస్తుతం 87 ఏళ్లు. జ్ఞాపక శక్తి కించిత్ కూడా తగ్గలేదు. యూఎస్ నుంచి తాను పోను చేసి పలికరిస్తే.. ఆప్యాయంగా మాట్లాడతారని సినారెతో తనకు ఉన్న అనుబంధాలు మధురానుభూతులు చిరస్మరణీయాలని ఇన్నయ్య పేర్కొన్నారు. 

Advertisement
Advertisement