Sakshi News home page

సమ్మె విరమణ

Published Wed, Feb 22 2017 11:19 PM

104 employees strike retirement

విధుల్లో చేరిన చంద్రన్న సంచార చికిత్స సిబ్బంది 
కలెక్టర్‌ జోక్యంతో ఆందోళనకు తెర
కాకినాడ వైద్యం : కనీస వేతనాల అమలు, పిరమిల్‌ సంస్థ వేధింపులకు నిరసనగా నాలుగు రోజులుగా విధులు బహిష్కరించిన జిల్లా చంద్రన్న సంచార చికిత్స సిబ్బంది బుధవారం సమ్మె విరమించారు. జిల్లాలో చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమం అమలు, నిర్వహణపై పిరమిల్‌ స్వాస్థ్య సంస్థ ప్రతినిధుల వేధింపులకు నిరసనగా, జీవో 151 ప్రకారం సిబ్బందికి వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఈనెల 17వ తేదీ నుంచి సిబ్బంది జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిబ్బంది సమ్మెకు దిగడంతో సంస్థ యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా 19వ తేదీన హడావుడిగా సిబ్బంది నియామకానికి ఇంటర్వూ్యలను కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో  నిర్వహించింది. ఈ విషయమై సిబ్బంది నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న సిబ్బందితో చర్చించి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించడంతో పిరమిల్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం సంఘ సభ్యులతో చర్చించారు. జీతాల పెంపు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. విధుల నుంచి తొలగించిన సామర్లకోట మండలానికి చెందిన ప్రసాద్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో సమ్మెను విరమించారు. బుధవారం నుంచి యధావిధిగా విధుల్లో చేరినట్టు సంఘ సభ్యులు తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ప్రశ్నిస్తే తొలగిస్తారా?’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ స్పందించి చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారమైనట్టు సభ్యులు తెలిపారు. ఇందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement