పది మూల్యాంకనంలో మార్పులు

25 Jul, 2016 21:45 IST|Sakshi
ఈ ఏడాది నుంచి అమలుకు విద్యాశాఖ కసరత్తు 
గురజాల: విద్యా వ్యవస్థలో బట్టీ విధానానికి ఇక కాలం చెల్లనుంది. ఈ విధానం నుంచి విద్యార్థులను బయటపడేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ సమాయత్తమైంది. ఇందులో భాగంగానే మూల్యాంకన విధానంలో మార్పులు..చేర్పులు తీసుకొచ్చింది. పదో తరగతి ప్రతి సబ్జెక్టులో సిద్ధాంతం (థియరీకి)80 మార్కులు, ఇంటర్నల్‌ మూల్యాంకనానికి 20 మార్కులు వేయనున్నారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్‌ పరీక్షలకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.  
బట్టీ విధానానికి స్వస్తి...
కచ్చితంగా వస్తాయనే ప్రశ్నలను కొందరు విద్యార్థులతో బట్టీ పట్టిస్తున్నారు. ఇకపై విద్యార్థులు సొంతంగా ఆలోచించి బహుళ సమాధానాలను రాసే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు పదో తర గతి పబ్లిక్‌ పరీక్షలను ప్రైవేట్‌గా వేలాది మంది విద్యార్థులు రాసేవారు. నూతన విధానంలో ఈ అవకాశముండదు.  
నూతన విధానంలో పరీక్షలిలా....
-  కొత్త విధానంలో పదో తరగతి హిందీ మినహా మిగిలిన పేపర్లన్నీ రెండేసి పేపర్లుతో కలిపి మెత్తం  11 పేపర్లు ఉంటాయి.
- ఒక పేపర్‌కు 40 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంటర్నల్‌ మూల్యాంకనం ద్వారా 20 మార్కులు కేటాయిస్తారు.
- ప్రతి మూల్యాంకనంలో నోటు పుస్తకాలు రాయడం, లఘు పరీక్షలు ఉంటాయి. త్రై మాసిక, అర్ధ సంవత్సర పరీక్షల మార్కులను బట్టి ఆ 20 మార్కుల్లో కలుపుతారు.  
- నిరంతర మూల్యాంకనంలో విద్యార్థులు సాధించే ఫలితాలను ప్రతి నెలా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 
 
ఈ ఏడాది నుంచి నూతన విధానం అమలు..
ఈ ఏడాది నుంచి సీసీఈ విధానం అమలు చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పరీక్ష పత్రం ఇవ్వనున్నారు. నూతన విధానంతో పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది. 
– డిప్యూటీ డీఈఓ శేషుబాబు, సత్తెనపల్లి
మరిన్ని వార్తలు