ఏడాదిలో 12వేల కేసులు పరిష్కారం | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 12వేల కేసులు పరిష్కారం

Published Tue, Nov 8 2016 11:46 PM

ఏడాదిలో 12వేల కేసులు పరిష్కారం

- న్యాయానికి ధనిక, పేద తేడా లేదు
- జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ. సోమశేఖర్‌
- నేడు జాతీయ న్యాయ సేవా దినోత్సవం 
 
కర్నూలు(లీగల్‌): సత్వరన్యాయం అందించడంలో భాగంగా నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌ల ద్వారా ఏడాది కాలంలో 12,194 కేసులకు పరిష్కారం లభించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్‌ తెలిపారు. నవంబర్‌ 9న జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా న్యాయసేవలు అందించడంలో భాగంగా గడపగడపకూ న్యాయ సేవలు–సలహాలు కార్యక్రమాన్ని వారం రోజులుగా కొనసాగిస్తున్నామన్నారు. పేదవారికి న్యాయం అందని ద్రాక్షగా కాకూడదనే నినాదంతో భారత రాజ్యాంగ నిర్మాతలు 39(ఎ) అధికరణాన్ని పొందుపరచడం, దాని మేరకు 1987లో చట్టం చేసి అక్టోబర్‌ 11 భారత రాష్ట్రపతిచే ఆమోద ముద్ర వేయబడిందన్నారు. 1995 నవంబర్‌ 9వ తేదీన చట్టాన్ని అమలులోకి తెచ్చారు. దీనిప్రకారం రూ. లక్ష లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరు ఉచిత న్యాయ సేవకు అర్హులన్నారు. అలాంటి వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం, కోర్టు ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్‌ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 690 లోక్‌ అదాలత్‌లు నిర్వహించి 12,194 కేసులు పరిష్కారం కాగా, అందులో 9,154 క్రిమినల్‌ కేసులున్నట్లు చెప్పారు. 1,052 మందికి కోర్టు ఫీజు మినహాయింపు ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా 169 మంది పారా లీగల్‌ వాలంటీర్లు, 108 మంది ప్యానల్‌ న్యాయవాదులున్నారని, 40 గ్రామాల్లో ఉచిత న్యాయ సేవా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణులకు న్యాయ సలహాలు అందిస్తున్నట్లు చెప్పారు. 
 

Advertisement
Advertisement