ఆ రైలు పట్టాలెక్కితే.. హైదరాబాద్కి150 కి.మీ. తగ్గుతుంది | Sakshi
Sakshi News home page

ఆ రైలు పట్టాలెక్కితే.. హైదరాబాద్కి150 కి.మీ. తగ్గుతుంది

Published Sat, Feb 20 2016 9:11 AM

ఆ రైలు పట్టాలెక్కితే.. హైదరాబాద్కి150 కి.మీ. తగ్గుతుంది - Sakshi

-1965 నుంచి సర్వేలకే పరిమితమైన కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్
-సాకారమైతే విశాఖ-హైదరాబాద్ మధ్య తగ్గే దూరం 150 కిలోమీటర్లు
-వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశం

 
 
కొవ్వూరు : రైతు కూత వినేందుకు ఐదు దశాబ్దాలుగా మన్యసీమ తహతహలాడుతోంది. కొవ్వూరు-భద్రాచలం మధ్య రైల్వే లైన్ సాకారమైతే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరం, గంటలకొద్దీ సమయం కలసి వస్తుందని ఉత్తరాంధ్ర ఆశపడుతోంది. రైలులో భద్రాచలం వెళ్లి రాములోరిని దర్శించుకోవచ్చని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే మెయిన్ లైన్‌పై ఒత్తిడి తగ్గుతుందని ఆ శాఖ చెబుతోంది. ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా.. ఆకాంక్షలను వెలిబుచ్చినా మన్యం రైల్వే ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తున్న నేపథ్యం, త్వరలో రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానున్న పరిస్థితుల్లో కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్‌పై ఈ ప్రాంత ప్రజల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి.
 
ప్రయోజనాలెన్నో..
ఈ రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదన ఏటా తెరపైకి వస్తున్నా.. 1965 నుంచి సర్వేలకే పరిమితమవుతోంది. ఇప్పుడైనా దీనిపై దృష్టి సారిస్తే నవ్యాంధ్రప్రదేశ్‌లోని మెట్ట, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తలుపులు తెరుచుకుంటాయని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో చింతలపూడి పరిసర ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు కనుగొనడంతో ఈ రైల్యే లైన్ ఆవశ్యకత మరింత పెరిగింది.
 
జిల్లాలోని జీలుగుమిల్లి, తాడువాయి రోడ్డు, జంగారెడ్డిగూడెం, రాజవరం, పొంగుటూరు, చిన్నాయిగూడెం, దేవరపల్లి, ఐ.పంగిడి మీదుగా కొవ్వూరు వరకు, తెలంగాణలోని భద్రాచలం రోడ్డు, రామవరం, గరీబ్‌పేట, రావికంపాడు, మద్దుకూరు, వేగులపాడు, దమ్మపేట, అశ్వారావుపేటను కలుపుతూ ఈ రైల్వే లైన్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. రవాణా పరంగా ఈ ప్రాంతాలన్నీ చింతలపూడికి ఎంతో అనువైనవి. మెట్టలో సాగయ్యే మిరప, పొగాకు, మొక్కజొన్న, ఆయిల్‌పామ్ వంటి వాణిజ్య పంటల ఎగుమతికి 151 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ అనువుగా ఉంటుంది.
 
రైల్వేకూ ప్రయోజనమే

విశాఖ-విజయవాడ మధ్య పెద్దఎత్తున రైళ్లు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రధాన రైల్వే లైన్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. భద్రాచలం రైలు మార్గం అందుబాటులోకి వస్తే మెయిన్ లైన్‌పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. దీంతోపాటు విశాఖ-హైదరాబాద్ మధ్య 150 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. తెలంగాణలో పారిశ్రామిక ప్రాంతాలైన సింగరేణి, మణుగూరు, కొత్తగూడెం, పుణ్యక్షేత్రమైన భద్రాచలం ప్రాంతాలకు రవాణాపరంగా ప్రయోజనం కలుగుతుంది.

మధ్యప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఐరన్, ఉప్పు, బొగ్గు తదితరాలను నేరుగా తెలంగాణలోని పారిశ్రామిక ప్రాంతాలకు తరలించవచ్చు. ఈ రైల్వే లైన్ ఆవశ్యకతను గుర్తించి 1964లో అప్పటి రైల్వే మంత్రి పూనాఛా మొట్టమొదటి సారిగా ఏరియల్ సర్వే చేయించారు. అప్పటి నుంచి ఏటా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిపాదనలు మాత్రం కార్యరూపం దాల్చలేదు.
 
పెరుగుతున్న అంచనాలు
ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2004-05, 2006 ఆధునికీకరించిన సర్వే నివేదికలు రైల్వే శాఖకు వెళ్లాయి. అప్పట్లో రూ.650 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదించారు. 2010 నాటికి అంచనా వ్యయం రూ.1,050 కోట్లకు పెరిగింది. తాజా పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం అంతకు రెట్టింపు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
రవాణా సులభతరం
కొవ్వూరు-భద్రాచలం రైల్వే సుమారు 50 ఏళ్లుగా నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే మెట్ట, గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితరాల ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఇక్కడి ప్రజలకు ఉపాధి పెరిగుతుంది. వచ్చే బడ్జెట్‌లో అయినా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
 -కోడూరి శివరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ, కొవ్వూరు
 
మెట్ట రైతులకు ఉపయోగం
 ఈ రైల్వే లైన్ మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ పండే మొక్కజొన్న, ఆయిల్‌పామ్ ఎగుమతులకు అవకాశం ఉంటుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు దూరం తగ్గుతుంది. సమయం, చార్జీలు ఆదా అవుతాయి. ముఖ్యంగా కొవ్వూరు, దేవరపల్లి మండలాల్లో ఉన్న నల్లరాతి ఎగుమతులకు అవకాశం ఉంటుంది.
 -పీకే రంగారావు, మాజీ ఎంపీపీ, ఐ.పంగిడి

Advertisement
Advertisement