ఉలికిపాటు | Sakshi
Sakshi News home page

ఉలికిపాటు

Published Tue, Oct 25 2016 1:44 AM

ఉలికిపాటు - Sakshi

 ఒంగోలు క్రైం :ఆంధ్రా-ఒడిశా బోర్డర్(ఏఓబి)లోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఎన్ కౌంటర్‌తో గత కొన్నేళ్లుగా ఎన్నడూ ఎరుగని రీతిలో మావోయిస్ట్‌లకు ఎదురుదెబ్బ తగిలింది. ఏఓబీలోని కాల్పుల్లో దాదాపు 23 మందికి పైగా పోలీసుల కాల్పుల్లో అమరులైన సంగతి తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు సైతం ఉండటంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.   మావోయిస్ట్ ఉద్యమంతో ఒకప్పుడు జిల్లా మారుమోగింది. అయితే ఏఓబీ వద్ద ఎన్‌కౌంటర్‌లో జిల్లాకు చెందిన మున్నా అలియాస్ పృధ్వీ ఉన్నాడన్న సమాచారం రావటంతో ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు.
 
  మావోయిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఆర్‌కె కుమారుడు మున్నా కావటమే ప్రచారానికి కారణం. దానికితోడు టంగుటూరు మండలం ఆలకూరపాడుతో మున్నాకు విడదీయలేని బంధం ఉంది. బాల్యం నుంచి మున్నా ఎక్కువగా ఆలకూరపాడలోనే పెరిగాడు. ఐదో తరగతి వరకు ఒంగోలులోని కేఎంఎస్ స్కూలులో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత ఆయన విద్యాభ్యాసం గుంటూరులో సాగింది. పదేళ్ల వయసు వచ్చేనాటికి కూడా అతడు తన తండ్రి చూడకపోవడం గమనార్హం.
 
  ఆలకూరపాడుకు చెందిన రాష్ట్ర విప్లవ రచయితల సంఘం నేత జి.కళ్యాణరావు మున్నాకు పెదనాన్న. మావోయిస్ట్ అగ్రనాయకుల్లో ఒకరైన మున్నా తండ్రి ఆర్‌కె విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావుకు తోడల్లుడు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్ట్‌లతో జరిగిన చర్చల సమయంలో కళ్యాణరావు కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు. మున్నా ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడని తెలియంతో అతనితో ఉన్న చిన్ననాటి స్మృతులు జ్ఞప్తికి తెచ్చుకొని మరీ మదనపడుతున్నారు. పది, పదిహేనేళ్లుగా అటు ఆలకూరపాడుతో కాని ఇటు ఒంగోలుతో కాని మున్నాకు సంబంధాలు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి.
 
 ఇప్పటికీ జిల్లాలో మావోల మూలాలు..
 ఒకప్పుడు నక్సలైట్లు కాలగమనంలో మావోయిస్ట్‌లుగా మారారు. వీరికి జిల్లా కంచుకోట లాంటిది. చర్చల అనంతరం మావోయిస్ట్ ఉద్యమకారులపై పట్టుసాధించటంతో పోలీసులు పైచేయిగా నిలిచారు. అనంతరం నల్లమల నుంచి మావోయిస్ట్ ఉద్యమం ఏఓబికి చేరింది. ఇప్పటికీ జిల్లాలో అక్కడక్కడా మావోయిస్ట్ మూలాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో జిరిగిన ఎన్‌కౌంటర్‌లో కొరిశపాడుకు చెందిన కొప్పర్తి సూర్యం అమరుడయ్యాడు. అప్పటి వరకు జిల్లాలో మావోయిస్ట్ మూలాలను పూర్తిగా రూపుమాపామనుకున్న పోలీసులకు ఒక్కసారిగా గుండెల్లో అలజడి మొదలైంది.
 
 దీంతో అప్రమత్తమయిన పోలీస్ ఉన్నతాధికారులు నల్లమలపై మళ్లీ శోధన ప్రారంభించారు. అందులో భాగంగా గత ఏడాది నవంబర్‌లో యర్రగొండపాలెం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ డంప్ బయట పడింది. ఆ డంప్‌లో రాకెట్ లాంచర్లతోపాటు అనేక రకాల మావోయిస్ట్‌లు వాడే ఆయుధ సామగ్రి, అందుకు వినియోగించే ముడి పదార్థాలు బయట పడ్డాయి. ఇదిలా ఉంటే మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో అమరుడైన మున్నాను జిల్లాకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement