కృష్ణా పుష్కరాలకు 275 ప్రత్యేక బస్సులు | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు 275 ప్రత్యేక బస్సులు

Published Tue, Aug 9 2016 12:09 AM

కృష్ణా పుష్కరాలకు 275 ప్రత్యేక బస్సులు - Sakshi

రాజమహేంద్రవరం సిటీ : కృష్ణా పుష్కరాలకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఈ నెల 12 మొదలు 275 ప్రత్యేక బస్సులు సా«ధారణ టిక్కెట్‌ ధరలతో నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవ రం ఆర్‌ఎం కార్యాలయంలో కృష్ణా పుష్కరాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి 100, విజయనగరం, శ్రీకాకుళం నుంచి 100, తూర్పుగోదావరి నుంచి 75 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ఇవి విజయవాడలోని వైవీ రావ్‌ ఎస్టేట్‌ నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు.

భక్తుల రద్దీ మేరకు వీటి సంఖ్య పెంచుతామన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి వెళ్లే బస్సులు విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ నుంచి రాకపోకలు సాగిస్తాయన్నారు. బస్సులు ఆగే ప్రాంతాల్లో పుష్కరనగర్లు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల బస్సులు నడపడం ద్వారా రూ.40 కోట్ల ఆదాయం లభించవచ్చని తెలిపారు. ఆయా బస్సుల్లో జీపీఎస్‌ విధానం ఏర్పాటు చేశామని డ్రీమ్స్‌స్టెప్‌ సీఈఓ అనీల్‌ తెలిపారు. ఆర్‌ఎం చింతారవికుమార్, డిప్యూటీ సీటీఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
తరలివెళ్లిన పోలీసులు
రాజమహేంద్రవరం క్రైం : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వహించడానికి రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ జిల్లా నుంచి 750 మంది పోలీసులు బయలుదేరి వెళ్లారు. గోదావరి అంత్య పుష్కరాలు 11తో ముగియనున్నందున, 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో వీరు విధులకు హాజరవుతారు.
 
 

Advertisement
Advertisement