3,842 కొత్త రేషన్‌ కార్డులకు మంగళం | Sakshi
Sakshi News home page

3,842 కొత్త రేషన్‌ కార్డులకు మంగళం

Published Sun, Jan 22 2017 12:29 AM

3,842 new ration cards reject

–ప్రజా సాధికార సర్వే ఆధారంగా తొలగింపు
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రభుత్వం ఇటీవల జిల్లాకు 87,302 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసింది. ఇందులో వెంటనే 3,842 కార్డులను రిజెక్టు చేసింది. ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సర్వే ప్రాతిపదికగా రేషన్‌ కార్డులకు ప్రభుత్వం మంగళం పలుకుతోంది. 5 ఎకరాలు పైబడి భూములు కలిగిన వారు, ఆస్తి పన్ను చెల్లించే వారు, కార్లు ఇతర నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, ఆధార్‌ తప్పులు, డూప్లికేట్‌ కార్డులను ప్రభుత్వం తొలగించింది. ఇవన్నీ ప్రజాసాధికార సర్వే ద్వారా వెలుగు చూశాయి. ప్రస్తుతానికి పరిమితంగా తొలగించినా రానున్న రోజుల్లో ప్రజాసాధికార సర్వే ఆధారంగా మరిన్ని కార్డులపై వేటు పడే అవకాశం ఉంది. అయితే వీటిపై మరోసారి విచారణ జరపాలని, వీరిలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు ఉంటే రేషన్‌ కార్డులను పునరుద్ధరించాలని సూచించింది. జిల్లాకు ప్రభుత్వం 87వేల కార్డులు మంజూరు చేసినప్పటికీ ఇందులో కొత్త కార్డులు పరిమితంగానే ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలకు ఉన్న కార్డులను విభజించి వేరుగా కార్డులు మంజూరు చేశారు. కాకపోతే కొంతమేర యూనిట్ల సంఖ్య పెరిగింది. ఇంతవరకు ఎలాంటి కార్డుల్లేని కుటుంబాలకు పరిమితంగానే కార్డులు మంజూరు చేశారు. వీటిని కొత్తకార్డులుగా వ్యవహరిస్తారు. ఇందులోని 3,842 కార్డులు తొలగించడం పట్ల కొత్త కార్డుల సంఖ్య మరింత తగ్గిపోయింది.
 
– ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మంజుల మల్లికార్జునకు ఇటీవల జేఏపీ 134805400032 నెంబర్‌ కార్డు కొత్తగా వచ్చింది. ఆయన ఆస్తి పన్ను కడుతున్నారనే ఉద్దేశంతో రేషన్‌ కార్డును రిజెక్టు చేశారు.
 

Advertisement
Advertisement