Sakshi News home page

జిల్లాలో 32 కరువు మండలాలు

Published Fri, Oct 21 2016 10:38 PM

జిల్లాలో 32 కరువు మండలాలు

- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో 32 మండలాలను కరువు కింద ప్రకటిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతు పవనాల వల్ల జిల్లాలో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఖరీఫ్‌లో వర్షాధారంపై సాగు చేసిన పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 1.34 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 97 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వేరుశనగ, పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటలు ఎండిపోయాయి.వేరుశనగ పంట ఊడలు దిగే సమయంలో వాన ముఖం చాటేసింది. ప్రభుత్వ రెయిన్‌గన్ల ప్రయోగం  ఫలితాలివ్వలేకపోయింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని 32 మండలాలను కరువు కింద ప్రకటించాలంటూ కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత బుధవారం రాష్ట్ర స్థాయి డ్రాట్‌ కమిటీ వివిధ జిల్లాల నుంచి ప్రతిపాదనలను పరిశీలించింది. కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనల మేరకు అన్ని మండలాలను కరువు కింద గుర్తిస్తూ జీఓ నెం. 9 విడుదల చేసింది. జిల్లాలో కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
 నిబంధనలు ఇవీ..
– ఏదైనా మండలాన్ని కరువు కింద ప్రకటించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను అనుసరిస్తుంది. ఇందులో వర్షపాతలోటు ప్రధానమైంది. సంవత్సర సాధారణ వర్షపాతం 750 మిల్లీ మీటర్లు ఉన్న మండలాల్లో 15 శాతం వర్షపాత లోటు ఉండాలి. జిల్లా సాధారణ వర్షపాతం 700మిల్లీమీటర్లు కనుక ఈ నిబంధన వైఎస్సార్‌ జిల్లాకు వర్తిస్తుంది. ఈ ఖరీఫ్‌లో ఈ నిబంధన ప్రకారం పరిశీలిస్తే 32 మండలాల్లో వర్షపాత లోటు నమోదైంది.
– ప్రధాన పంటల సాధారణ సాగు విస్తీర్ణం 50 శాతానికి మించి తగ్గిపోవాలి.
– ఐదు సంవత్సరాల సగటు పంట దిగుబడులతో పోలిస్తే 33 శాతం దిగుబడి నష్టం ఉండాలి.
– పంటలను ప్రభావితం చేసే డ్రై స్పెల్స్‌ నమోదు ఉండాలి.
– నార్మలైజ్డ్‌ విజిటేటివ్‌ డిఫరెన్షియల్‌ ఇండెక్స్‌
– పై నిబంధనలలో వర్షపాత లోటు తప్పనిసరిగా ఉండాలి. మిగతా వాటిల్లో ఏదేని రెండు వర్తిస్తే ప్రభుత్వం వాటిని కరువు మండలాల కింద ప్రకటిస్తుంది.
కరువు మండలాలు ఇవీ
కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, తొండూరు, చక్రాయపేట, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బ్రహ్మంగారిమఠం, గోపవరం, బద్వేలు, అట్లూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, రాజుపాలెం, బి.కోడూరు, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వేంపల్లె, రామాపురం, వీరబల్లి.

Advertisement

తప్పక చదవండి

Advertisement