సమస్యలు మొండి...అర్జీలు దండి | Sakshi
Sakshi News home page

సమస్యలు మొండి...అర్జీలు దండి

Published Mon, Sep 18 2017 10:45 PM

472 Applications for meekosam

  • ‘మీ కోసం’లో 472 దరఖాస్తులు
  • అనంతపురం అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ‘మీకోసం’లో వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం చూపే వారే కరువవడంతో జనం ప్రతి సోమవారం వచ్చి కలెక్టరేట్‌లో అర్జీలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి, జేడీఏ శ్రీరామ్మూర్తిలు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 472 అర్జీలు వచ్చాయి. ఇందులో ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేయాలంటూ 125 మంది అర్జీలిచ్చారు.

     

    పోటీపరీక్షలకు కోచింగ్‌ ఇప్పించండి

    దివ్యాంగులైన కుళ్లాయప్ప, రవినాయక్, శ్రీనివాసులు, ఎర్రిస్వామి, ఓబుళేసు, తదితరులు ‘మీ కోసం’లో తమ సమస్యను జాయింట్‌ కలెక్టర్‌కు విన్నవించారు. తామంతా పీజీ, పీహెచ్‌డీ, డైట్, డీఎడ్, ఎంఎస్‌సీ బీఈడీ, డిగ్రీ చేశామన్నారు. దివ్యాంగుల కోటా కింద బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయడంలో జాప్యం చేస్తున్నారన్నారు. పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన విధంగా తమకూ ఉచిత కోచింగ్‌ ఇప్పించాలని కోరారు. అలాగే నగర పరిధిలోని ఎర్రనేల కొట్టాల ప్రాంతంలో ఐదేళ్లగా కొనసాగుతున్న  దివ్యాంగ హోమ్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. తక్షణం తమ సమస్య పరిష్కరించకపోతే జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ తరలివచ్చి ఆందోళన చేస్తాన్నారు.

     

    రెండుసార్లు చెప్పుకున్నా పరిష్కారం కాలేదు

    తన పొలం పక్కనే ఉన్న మరోపొలంలో  అక్రమంగా బోరు వేశారనీ, దీంతో తన బోరులో నీరు రాకపోవడంతో 300 చీనీ చెట్లు ఎండిపోతున్నాయని తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లికి చెందిన యు.రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెండుసార్లు ‘మీ కోసం’లో అర్జీ ఇచ్చుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అర్జీ ఇచ్చినప్పుడు వెళ్లి తహసిల్దారుని కలవాలని అధికారులు చెప్పారన్నారు. అక్కడి వెళ్లి తహసిల్దారుని కలిస్తే పని కూదరని ఆయన చెబుతున్నారన్నాడు. చీనీ చెట్లు పూర్తిగా ఎండిపోతే తీవ్ర నష్టం జరుగుతుందని... అదే జరిగితే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే మార్గమని ఆవేదన వ్యక్తం చేశాడు.

     

    దొంగ ఓట్లు నమోదు చేశారు

    యల్లనూరు మండలం మేడికుర్తి గ్రామంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని గ్రామస్తులు సూర్యనారాయణరెడ్డి, నరేంద్ర, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు జేసీకి విన్నవించారు. జమ్మలమడుగు, తాడిపత్రి, ప్రొద్దుటూరు, దోసలేడు, యల్లనూరులో నివాసముంటున్న వారిని మేడికుర్తిలో నివాసముంటున్నట్లుగా చూపిస్తూ ఓటు నమోదు చేశారని తెలిపారు. దొంగ ఓట్లు నమోదు చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే నమోదైన ఓట్లను తొలగించాలని కోరారు.

     

    సమస్య పరిష్కారం కాలేదు

    ఇతని పేరు చాంద్‌బాషా. శింగనమల మండలం రాచేపల్లి గ్రామం. నడవలేని స్థితిలో ఉన్నాడు. 20 ఏళ్ల క్రితం రాచేపల్లి గ్రామం సర్వే నంబరు 104లో మూడు సెంట్ల స్థలం ప్లాట్‌ నంబరు 50 పట్టాను అతని తండ్రి బసుద్ధీన్‌కు ప్రభుత్వం ఇచ్చింది. తండ్రి చనిపోవడంతో 2010లో చాంద్‌బాషా తన పేరుపైనే పట్టా మార్చుకున్నాడు. మూడు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే వేరొక వ్యక్తి వచ్చి ‘మీ నాయనకు రూ.500 ఇచ్చాము. ఈ స్థలం నాది’ అంటూ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తే అప్పటికి మిన్నకున్న వారు మళ్లీ లాక్కునేందుకు చూస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement
Advertisement