52 కుటుంబాల సాంఘిక బహిష్కరణ | Sakshi
Sakshi News home page

52 కుటుంబాల సాంఘిక బహిష్కరణ

Published Tue, Nov 1 2016 11:48 PM

52 కుటుంబాల సాంఘిక బహిష్కరణ - Sakshi

 జక్రాన్‌పల్లి(డిచ్‌పల్లి) : డిచ్‌పల్లి సర్కిల్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం చింతలూర్ గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన 52 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాల వారు సోమవారం డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి కి తరలి వచ్చి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, ధర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపిని కలిసి విషయం తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..
 
 బహిష్కరణకు గురైన ముదిరాజ్ కుటుంబాల వారికి గ్రామంలోని ఇతర కులస్తులు సహకరించరాదని, ఎవరైనా సహకరిస్తే వారిని సైతం బహిష్కరిస్తామని వీడీసీ సభ్యులు హెచ్చరించారని తెలిపారు. గ్రామానికి చెందిన ముత్తన్న కు సంబంధించిన ఐదు ఇసాల పట్టా భూమిని కాలువ నిర్మాణం కోసం ఇవ్వాలని వీడీసీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ముదిరాజ్ కులపెద్దల ద్వారా ముత్తన్నపై ఒత్తిడి తెచ్చారు. అయితే తాను కోల్పోతున్న భూమికి నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే భూమి ఇచ్చేది లేదని ముత్తన్న స్పష్టం చేశాడు.
 
  దీంతో తాము చెప్పిన మాట వినడం లేదనే సాకుతో గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన 52 కుటుంబాల వారిని సాంఘిక బహిష్కరణ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో బాధితులు జిల్లా కలెక్టర్ యోగితారాణా ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఈ విషయమై విచారణ జరపాలని డిచ్‌పల్లి సీఐ తిరుపతిని ఆదేశించినట్లు ఎంపీపీ గోపి తెలిపారు.  కలెక్టర్ సూచన మేరకు జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
Advertisement