చిన్నారి ప్రాణం ఖరీదురూ.6 లక్షలు | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణం ఖరీదురూ.6 లక్షలు

Published Wed, Sep 6 2017 12:43 PM

ప్లే స్కూల్‌ యజమాని భర్త రామహరినాథ్‌తో మాట్లాడుతున్న మృతుని తండ్రి గోపాలరావు, బంధువులు

వెలకట్టిన పోలీసులు, ఇతర పెద్దలు   
ఆందోళన విరమించిన తల్లిదండ్రులు
స్వగ్రామానికి గౌతమ్‌ మృతదేహం
 

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు):
పోలీసులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర పెద్దలు కలిసి చిన్నారి ప్రాణానికి రూ.6లక్షల ఖరీదు కట్టారు. దళారులుగా మారిన కొందరు ప్లే స్కూల్‌ యాజమాన్యానికి, బాలుడి తల్లిదండ్రులకు మధ్యవర్తిత్వం నెరిపి రాజీ కుదిర్చారు. వివరాల్లోకి వెళ్తే... విశాలాక్షినగర్‌ శ్రీసూర్యచంద్ర ప్లే స్కూల్‌ భవన శ్లాబ్‌ కూలి విద్యార్థి గౌతమ్‌(3) సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని మంగళవారం కైలాసగిరి సర్కిల్‌కు తల్లిదండ్రులు గోపాలరావు, సంధ్య, బంధువులు, పోలీసు కుటుంబీకులు తీసుకొచ్చి నిరసన తెలిపారు. ప్లే స్కూల్‌ యాజమాన్యం ఇక్కడకు వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు బాలుడికి అంత్యక్రియలు చేపట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

యాజమాన్యం రాకుంటే ప్లే స్కూల్‌ ఎదురుగానే అంత్యక్రియలు చేపడతామని పోలీసులకు నిరసనకారులు స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత ముదురింది. ఆరిలోవ పోలీసులు, సీఐ రాంబాబు నచ్చజెప్పినా వినలేదు. ఈలోగా ఏపీ గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఒ.రామలింగం, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు పడాల రమణ, ఇతర గిరిజన సంఘాల ప్రతినిధులు నిరసన వద్దకు చేరుకున్నారు. దీంతో సీఐ రాంబాబు జోక్యం చేసుకుని రాజీ కుదర్చాలని గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఒ.రామలింగానికి సూచించారు. సీఐ ఆదేశాల మేరకు రామలింగం, పడాల రమణ, ఇతర గిరిజన పెద్దలు మృతుని తండ్రి గోపాలరావు, వారి బంధువులను ప్రలోభాలకు గురిచేసి ఒప్పించారు. స్కూల్‌ యాజమాన్యంపై కేసు లేకుండా చేశారు.

ప్రలోభాలకు గురిచేసిన పెద్దలు
చర్చల అనంతరం మధ్యాహ్నానికి ప్లే స్కూల్‌ యజమాని సూర్యప్రభ భర్త రామహరినాథ్‌ను సీఐ  రాంబాబు ఫోన్‌ ద్వారా నిరసన స్థలానికి రప్పించారు. పోలీసుల వలయం మధ్య వారితో కొద్దిసేపు బాలుడి బంధువులు, తల్లిదండ్రులను మాట్లాడించారు. అనంతరం నష్టపరిహారం ఇప్పించేందుకు  కొంతమందిని కమిటీగా నియమించారు. మృతుడి బంధువులు, కమిటీ సభ్యులు బాలుడి మృతికి రూ.15లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనికి యజమాని రామహరినాథ్‌ అంగీకరించ లేదు. అదే సమయంలో గిరిజన తల్లిదండ్రుల కడుపుకోతను పట్టించుకోని మధ్యవర్తులు రూ.6లక్షలు పరిహారం తీసుకునేలా వారిని ఒప్పించారు.

కేసు నిర్వీర్యం చేయించారు. పథకం ప్రకారం నిరసన స్థలానికి వచ్చిన స్కూల్‌ యజమాని భర్త రామహరినాథ్‌ అక్కడికక్కడే మృతుని తండ్రి గోపాలరావుకు రూ.లక్ష నగదు, రూ.5లక్షల చెక్కు అందజేసి వెళ్లిపోయాడు. అనంతరం మృతదేహాన్ని బాలుడి స్వగ్రామం ముంచుంగిపుట్టు మండలం గొడుగుపుట్ట గ్రామానికి తీసుకెళ్లారు. కమిటీలో పి.లక్ష్మీకళ,  ఏఆర్‌ పోలీస్‌ ఆర్మీ రిజర్వడ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధక్షుడు సుబ్బరాజు, నల్ల రవికుమార్, కృపాజ్యోతి, గిరిజన సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

అనుమతి లేని ప్లే స్కూళ్లు మూసేయాలి
మూడేళ్ల బాలుడు గౌతమ్‌ మృతి చెందిన విషయం తెలుసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ గంటా హైమావతి నిరసన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న గుర్తింపు లేని ప్లే స్కూళ్లపై చర్యలు తీసుకుని మూసివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చేపట్టే అంగన్‌వాడీ, ప్రైమరీ పాఠశాలల్లోనే భద్రత ఉం టుందన్నారు. ప్లే స్కూళ్ల యాజమాన్యాలు ఫీజులు దండుకుంటున్నా పిల్లలకు భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement