9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Published Tue, Nov 3 2015 3:08 AM

9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

 సైదాపూర్ రూరల్: స్కూల్ అంటే భయపడి ఓ విద్యార్థిని ఉసురు తీసుకుంది. తక్కువ మార్కులొచ్చినందుకు టీచర్ కొడతారనే భయాందోళనతో ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయుడి తీరు నచ్చక తీవ్ర ఒత్తిడితో, అంతులేని ఆవేదనతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. సోమవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లిలో జరిగిన  ఈ ఘటన సంచలనం సృష్టించింది. ‘ఆ స్కూల్ అంటే నాకు ఇష్టం లేదు. మాకు చదువు చెప్పిన సాదిక్ సార్‌ను విడిచిపెట్టొద్దు. ఇది నా ఆఖరి కోరిక’ అని సూసైడ్ నోట్ రాసి కోడం శ్రావణి(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి ఇదే మండలంలోని సోమారం మోడల్ స్కూల్లో చదువుతోంది. విరేచనాలు అవుతున్నాయని సోమవారం బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న ఆమె.. కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లాక మధ్యాహ్నం సూసైడ్ నోట్ రాసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. తల్లిదండ్రులు ఇంటికొచ్చి చూసే సరికి పూర్తిగా కాలిపోయి మరణించి ఉంది. ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియా ల్సి ఉంది. సంఘటన స్థలంలో శ్రావణి సూసైడ్ నోట్ లభించింది.  
 
 సూసైడ్ నోట్‌లోని వివరాలివీ..

 ‘నేను చనిపోవాలనుకుంటున్నా. ఎం దుకంటే నాకు తక్కువ మార్కులు వచ్చాయి. ఆ స్కూల్ అంటే నాకు నచ్చడం లేదు. అక్కడ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రాజెక్టులు చేయమంటరు. కానీ వాటిల్లో మమ్మల్ని దగ్గరకు రానీయకుండా వేధిస్తున్నారు. నా ఆఖరి కోరిక సాదిక్ సార్‌ను ఇరుగపరుగ కొట్టాలి. అసలు నేను నిన్ననే చనిపోతానని అనుకున్నా. కానీ, అందరూ ఇంటికాడనే ఉన్నరు. ఇవ్వాళ ఎట్ల చేసైనా నేను స్కూల్‌కు పోవద్దని, విరేచనాలు అయితున్నయని అబద్ధం చెప్పిన. నన్ను క్షమించు అమ్మా. నేను చనిపోతే బాధపడకు. నువ్వన్నా, నాన్నన్నా నాకు మస్తు ఇష్టం. ఎలా చనిపోదామనుకున్నా దొరుకుత. అందుకే కిరోసిన్ పోసుకుని చద్దామనుకుంటున్న. అన్నయ్యా.. నువ్వు మంచి గ్రేడ్ తెచ్చుకోవాలే’
- ఇట్లు  కె.శ్రావణి

Advertisement
Advertisement