అక్షయ గోల్డ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు | Sakshi
Sakshi News home page

అక్షయ గోల్డ్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు

Published Fri, Aug 26 2016 7:19 PM

a charge sheet  filed on the Akshaya Gold

అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమెటెడ్ సంస్థపై శుక్రవారం విజయవాడ సీఐడీ పోలీసులు ఒంగోలు జిల్లా కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీఐడీ ఏఎస్పీ మేరి ప్రశాంతి ఒంగోలుకు చేరుకొని జిల్లా కోర్టులో చార్జ్ షీట్ వేశారు. మొత్తం రూ.330 కోట్లు ప్రజాధనాన్ని సంస్థ యాజమాన్యం అక్రమంగా కాజేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు అన్ని పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 2,200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు.

 

సంస్థకు చెందిన 2,500 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన సమయంలో బ్యాంకుల్లో నిల్వ ఉన్న రూ.10 కోట్లు లావాదేవీలు జరగకుండా స్తంభింపజేశారు. ఈ కేసులో సంస్థతో పాటు, సంస్థకు చెందిన 37 మందిపై కేసు నమోదు చేశారు. 2012 సంవత్సరంలో అప్పటి జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డి అక్షయ గోల్డ్ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. అప్పట్లో దక్షణ బైపాస్‌లో ఉన్న పాత జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న కల్యాణమండపంలో సంస్థ సీఎండీ, డెరైక్టర్లు, ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని సమాచారం తెలుసుకొని అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

 

అక్షయ గోల్డ్ సీఎండీ భోగి సుబ్రహ్మణ్యంతో పాటు డెరైక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యంతో పాటు నూతన సీఎండీ పాల్‌సన్, వ్యవస్థాపక డెరైక్టర్లు మునగపాటి సుధాకర్, దేవకి హరనాథ్‌బాబు, ఆత్మకూరి రమేష్ బాబుతో పాటు మరో 18 మంది డెరైక్టర్లపై కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు సీఐడీ పోలీసులకు అప్పగించారు. సంస్థతో పాటు మొత్తం 37 మందిపై కేసు నమోదు చేశారు. పాత, కొత్త సీఎండీలతో పాటు 21 మంది డెరైక్టర్లు, సంస్థలో కీలక పదవుల్లో ఉన్న మరో 14 మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా గొలుసుకట్టు వ్యాపారం ద్వారా ప్రజల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు.

Advertisement
Advertisement