Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Thu, Jul 28 2016 12:06 AM

విద్యుదాఘాతంతో రైతు మృతి - Sakshi

ఆత్మకూరు(ఎం):
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయిపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బచ్చె అయిలయ్య (35) తన మామ వ్యవసాయబావి వద్ద పంపుసెట్‌ మోటారు సక్రమంగా నడవకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్‌చేయడానికి వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏబీ స్విచ్‌ పట్టుకుని ఆఫ్‌ చేస్తుండగా విద్యుత్‌ప్రసరణ జరిగి ప్రమాదానికి గురయ్యాడు. అక్కడే ఉన్న కొందరు రైతులు గుర్తించి గాయపడిన అయిలయ్యను చికిత్స నిమిత్తం మోత్కూర్‌కు తరలిస్తుండగా మర్గమధ్యలో మృతిచెందాడు.  మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి సోదరుడు బచ్చె నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలం వద్ద సందర్శించి శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.శివనాగప్రసాద్‌ తెలిపారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన బచ్చె అయిలయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి ఆదుకోవాలని ఎంపీపీ కాంబోజు భాగ్యశ్రీ, సర్పంచ్‌ బొట్టు మల్లమ్మ కోరారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆరోపణ
 బచ్చె అయిలయ్య మృతికి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు అస్తవ్యస్తంగా ఉన్నట్లు చెప్పారు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


 
 

Advertisement

What’s your opinion

Advertisement