ఆమంచి అతిపెద్ద అక్రమార్కుడు | Sakshi
Sakshi News home page

ఆమంచి అతిపెద్ద అక్రమార్కుడు

Published Thu, Nov 3 2016 9:52 PM

ఆమంచి అతిపెద్ద అక్రమార్కుడు

  • పర్సంటేజీలు ఇవ్వకుంటే దాడులు చేయిస్తుంటాడు
  • ఎవరైనా ఎదురుతిరిగిన వారిపై మావోయిస్టు ముద్ర
  • నా దగ్గర ఆధారాలున్నాయి
  • ఎమ్మెల్యే దురాగతాలపై న్యాయ పోరాటం చేస్తాం
  •  వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ వరికూటి అమృతపాణి
  • చీరాల:
    ‘చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అతిపెద్ద అక్రమార్కుడు. రోజుకు 200 లారీల ఇసుక చీరాల నుంచి హైదరాబాద్‌కు రవాణా చేసి రూ. కోట్లు దండుకుంటున్నాడు. ఎమ్మెల్యే అక్రమాలపై నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఆమంచి కృష్ణమోహన్‌ దురాగతాలపై న్యాయ పోరాటం చేస్తా’నని వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ వరికూటి అమృతపాణి అన్నారు. చీరాలలోని ఆయన వైద్యశాలలో గురువారం రాత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు.
     
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వైద్యశాలల వైద్యులు తనకు అనుకూలంగా లేరనే ఉద్దేశంతో మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో ప్రైవేటు వైద్యశాలలపై తనిఖీలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే తన వైద్యశాలకు సెల్లార్‌ లేకపోయినా ఉందనే నెపంతో పాటు, సెల్లార్‌లో వ్యాపారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మున్సిపల్‌ అధికారులతో తనకు నోటీసులు అందించారన్నారు.
     
    చీరాలలో ఏ వ్యాపారం చేయాలన్నా ఆమంచికి పర్సంటేజీ ఇవ్వాలని, వైద్యులు అలా ఇవ్వనందునే దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రూ. 75 లక్షల విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అనుమతి లేని చానళ్లను పైరసీ ద్వారా సరఫరా చేస్తున్నారన్నారు. పందిళ్లపల్లిలోని ఎస్సీ గ్రామకంఠం భూమిని ఆక్రమించి అందులో ఇల్లు కట్టాడని, చివరకు ఎమ్మెల్యే తండ్రి సమాధి కూడా ఎస్టీల భూముల్లో నిర్మించాడన్నారు. ఎమ్మెల్యేపై 25 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రౌడీషీట్‌ తెరవాలన్నారు.
     
    ఎమ్మెల్యేకు అడ్డుగా ఉన్నందుకే పొట్టి సుబ్బయ్య పాలెం ఖాళీ చేయించే ప్రయత్నం
    ఎమ్మెల్యేకు ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ నుంచి మురుగు, ఇతర వ్యర్థాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన కంపెనీకి అడ్డుగా ఉన్న పొట్టిసుబ్బయ్య పాలేన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేశారని వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి అమృతపాణి ఆరోపించారు. రొయ్యల ఫ్యాక్టరీకి పర్యావరణశాఖ అనుమతి లేదన్నారు. అటవీభూముల్లో పైపులైన్లు వేసి అక్రమంగా వాడుకుంటున్నారని విమర్శించారు. చేనేత కార్మికులకు 450 ఇళ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి కేవలం 250 మాత్రమే కట్టి మిగతా నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. 
     
    ఆమంచి అరాచకాలను వ్యతిరేకిస్తున్న వారిపై మావోయిస్టు ముద్ర వేసి మాచర్ల మోహన్‌రావు లాంటి చేనేత నాయకునిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. ఆమంచి అక్రమాలపై తనవద్ద ఉన్న ఆధారాలతో న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిపారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో నాయకుడిగా ఉన్నందునే తనపై వైధింపులకు పాల్పడుతున్నారన్నారు. చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ, పార్టీ నాయకులు ఉన్నారు.  

Advertisement
Advertisement