జలం.. అథః పాతాళం | Sakshi
Sakshi News home page

జలం.. అథః పాతాళం

Published Wed, Mar 29 2017 9:59 PM

జలం.. అథః పాతాళం - Sakshi

  • మండే ఎండలకు ఆవిరైపోతున్న నీరు
  •  26.50 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భజలాలు
  •  44 మండలాల్లో ప్రమాద ఘంటికలు
  •  ఒట్టిపోతున్న బోరుబావులు
  •  నిలువునా ఎండిపోతున్న పండ్లతోటలు
  •  రానురాను మరింత కష్టం
  • సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మండే ఎండలకు నీటి వనరులు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోయాయి. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా సరాసరి నీటి మట్టం 26.50 మీటర్లకు చేరింది. మొత్తమ్మీద 44 మండలాల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో మరింత కఠిన పరిస్థితులు తప్పవని అధికారులతో పాటు ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది 553 మిల్లీమీటర్ల (మి.మీ) సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుండగా.. కేవలం 290 మి.మీ నమోదైంది. జూన్, జూలై మినహా ఒక్క నెలలో కూడా సాధారణ వర్షం కురవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో మంచి వర్షాలు పడాల్సివుండగా వరుణుడు పూర్తిగా మొహం చాటేశాడు. ఈ క్రమంలో భూగర్భజలాలు క్షీణించిపోతున్నాయి. గత డిసెంబర్‌లో 20 మీటర్లు, ఈ ఏడాది జనవరిలో 22 మీటర్లు, ఫిబ్రవరి 23 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 26 నుంచి 27 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. తాజా నీటిమట్టం సగటున 26.50 మీటర్లుగా నమోదైనా.. దాదాపు 44 మండలాల్లో సగటుకన్నా లోతుకు పడిపోవడం ఆందోళన కల్గిస్తోంది. యాడికి మండలం నగరూరులో 82 మీటర్లు, గాండ్లపెంటలో 80, అగళి 77, లేపాక్షి మండలం పులమతి, శిరివరం 69, రొద్దం మండలం శ్యాపురం 67, అమరాపురం 65, మడకశిర మండలం ఆర్‌.అనంతపురం 60, గోరంట్ల మండలం పులగూర్లపల్లి 56, పరిగి 55, బుక్కపట్నం మండలం పి.కొత్తకోట 53, మారాల 52, సోమందేపల్లి మండలం చాలకూరు 51, పెనుకొండ 51, గుమ్మఘట్ట మండలం తాళ్లకెరె 50, రాప్తాడు మండలం మరూరు 48, బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి 46, గుడిబండ మండలం కుమ్మరనాగేపల్లి 44, హిందూపురం మండలం మణేసముద్రం 44, తాడిమర్రి మండలం పిన్నదరి 43, నల్లచెరువు మండలం జోగన్నపేట 42, హిందూపురం మండలం మలుగూరులో 42 మీటర్ల లోతుకు భూగర్భజలాలు చేరుకున్నాయి. 
     
    చివరి స్థానంలో ‘అనంత’
    భూగర్భజలాల విషయంలో ‘అనంత’ చివరి స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సగటు నీటిమట్టం 13.99 మీటర్లు ఉండగా.. అందులో రాయలసీమ జిల్లాల సగటు 19.80 మీటర్లు. అలాగే కోస్తా జిల్లాల సగటు నీటిమట్టం 11.40 మీటర్లుగా నమోదైంది. సీమ జిల్లాల విషయానికి వస్తే కర్నూలు జిల్లా 10.82 మీటర్లు, చిత్తూరు జిల్లా 19.80 మీటర్లు, వైఎస్సార్‌ జిల్లా నీటిమట్టం 22.37 మీటర్లుగా నమోదైంది. ‘అనంత’లో మాత్రం పరిస్థితి ఘోరంగా ఉండటంతో చివరిస్థానంలో నిలిచింది.
     
    పంటలు, పండ్లతోటలు ఎండుముఖం 
    కుంటలు, చెరువులు నీళ్లు లేక నెర్రెలు చీలాయి. కొండలు, గుట్టలు పచ్చదనం లేక బోసిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా చాలా మండలాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్ముందు ఈ సమస్య మరింత జఠిలంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక గ్రాసం లేక పశువులు, జీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. వందల ఎకరాల్లో మల్బరీ, పండ్లతోటలు ఎండుముఖం పట్టాయి.  70-80 వేల బోర్లు ఎండిపోవడంతో అధికారికంగా 4,500 ఎకరాల్లో మల్బరీ, 1,500 ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోయాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మున్ముందు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే పంటలు, పండ్లతోటలు, పశువుల మనుగడకు విఘాతం ఏర్పడే ప్రమాదముంది.

Advertisement
Advertisement