ఏసీబీ వలలో సివిల్‌ సప్లైస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సివిల్‌ సప్లైస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌

Published Fri, Sep 23 2016 10:56 PM

ఏసీబీ వలలో సివిల్‌ సప్లైస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ - Sakshi

కాకినాడ సిటీ :
కాంట్రాక్ట్‌ వర్క్‌ఆర్డర్‌ ఇచ్చే విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పౌర సరఫరాల కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌) ఎంజేకే రాజ్‌కుమార్‌ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. మండపేటలోని మండల స్థాయి స్టాక్‌పాయింట్‌ గోదాము నుంచి కపిలేశ్వరపురం, ఆలమూరు మండలాల్లోని చౌక దుకాణాలకు నిత్యావసర సరుకులు ట్రాక్టర్‌ ద్వారా సరఫరా చేసేందుకు ఆలమూరు మండలం పెనికేరుకు చెందిన వైట్ల వెంకట్రావు తన కుమారుడు తిరుమలరావు పేరున జూలైలో టెండర్‌ దాఖలు చేశారు. దీనికి పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయగా, ఇందుకు సంబంధించి రూ.1.75 లక్షల డిపాజిట్, రూ.2.25 లక్షల బ్యాంక్‌ గ్యారంటీని కార్పొరేషన్‌ అధికారులకు కాంట్రాక్టర్‌ అందజేశారు. వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి పౌర సరఫరాల కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌) ఎంజేకే రాజ్‌కుమార్‌ రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఆ కాంట్రాక్టర్‌ ఈ నెల 6న అంత సొమ్ము ఇచ్చుకోలేనంటూ, రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం రూ.20 వేల నగదును రాజ్‌కుమార్‌కు వెంకట్రావు అందజేయగా, ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐ రామ్మోహన్‌రావు, ఎస్సై నరేష్‌ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement